● ఆటో, మోటార్ కార్మికుల డిమాండ్
● సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్
అమలాపురం రూరల్: తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండుతో ఆటో, క్యాబ్, లారీ, అంబులెన్స్ తదితర మోటార్ రవాణా రంగ కార్మికులు సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన స్థానిక నల్ల వంతెన నుంచి వందలాది మంది ఆటో కార్మికులు కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, ఏపీ ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మోటార్ రవాణా కార్మికులు రోజుకు 12 నుంచి 16 గంటల పాటు శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, భారీ జరిమానాలు, ఈ–చలానాల వేధింపులు, ఇంధన ధరల పెరుగుదల వంటి కారణాలతో వారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ జరిమానాలు, ఈ–చలానాల ద్వారా ఆర్థిక భారం మోపడాన్ని నిలిపివేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ అగ్రిగేటర్ల కమీషన్లను నియంత్రించి, డ్రైవర్లకు కనీస ఆదాయం కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఆర్థిక రక్షణ ప్యాకేజీ ప్రకటించాలని, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీలపై పన్నులు తగ్గించి, వాణిజ్య రవాణా కార్మికులకు సబ్సిడీపై అందించాలని, ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ఉచిత ప్రమాద బీమా, పింఛను, పిల్లల విద్యకు స్కాలర్‌షిప్పులు అందించాలని, డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని, బ్యాంకుల ద్వారా 5 శాతం రాయితీ వడ్డీతో రూ.4 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలని, 108, అంబులెన్స్ డ్రైవర్లకు ఉద్యోగ, వేతన భద్రత కల్పించాలని, లారీ డ్రైవర్ల కోసం హైవేలపై పార్కింగ్, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు, నగరాలు, పట్టణాల్లో ఆటోలు, క్యాబ్‌ల కోసం అధికారికంగా ఉచిత స్టాండ్లు, పార్కింగ్ ప్రదేశాలు కేటాయించాలని, ప్రతి నియోజకవర్గంలోను ఆటో యూనియన్ భవనాలను ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి శంకర్, బొక్కా నాని, జిల్లా కోశాధికారి మోకా శ్రీను, ఉపాధ్యక్షుడు యల్లమెల్లి వెంకటేశ్వరరావు, పట్టణ శాఖ అధ్యక్ష కార్యదర్శులు రాయుడు ప్రసాద్, కాళ్ల భీమరాజు తదితరులు పాల్గొన్నారు.


