నేడు ఆక్వా రైతుల చలో అమలాపురం | - | Sakshi
Sakshi News home page

నేడు ఆక్వా రైతుల చలో అమలాపురం

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

మేత ధరల పెంపుపై ఆగ్రహంతో ఉన్న ఆక్వా రైతులు కంపెనీలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో తేల్చుకుంటామని హెచ్చరించిన రైతులు.. సాగు సమ్మె చేసే యోచనలో కూడా ఉన్నామంటున్నారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు నిర్వహించనున్నారు.

సాక్షి, అమలాపురం: అమలాపురంలో నిర్వహించనున్న ఆక్వా రైతుల రాష్ట్రస్థాయి సదస్సుకు కోనసీమ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వనామీ సాగు చేసే రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు మేత ధరలు పెంచడంపై రైతులు భగ్గుమంటున్నారు. గత నెల చివరిలో టన్నుకు రూ.5,700 పెంచుతున్నామని కంపెనీలు లేఖలు ఇచ్చి, అమలులోకి వచ్చేసరికి రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచాయి. గడచిన రెండు నెలల్లో టన్నుకు రూ.21 వేల వరకు పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన మేత ధరల వల్ల కోనసీమ జిల్లాలో రైతులపై రూ.260 కోట్ల భారం పడనుందని అంచనా. ఈ నేపథ్యంలో రైతులు పలు డిమాండ్లను ముందుకు తెచ్చారు.

చర్చించే అంశాలు ఇవే...

● వనామీ, టైగర్‌ పెంచిన మేత ధరలను వెనక్కి తీసుకోవాలని, ఆక్వా అభివృద్ధి సంస్థ కమిటీతో చర్చించకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

● చెరువు వద్ద రొయ్య ధరలను పది రోజుల పాటు స్థిరంగా ఉంచాలని, 100 నుంచి 20 కౌంట్‌ వరకు శాసీ్త్రయ ధరల వ్యత్యాసాన్ని మార్చకూడదని డిమాండ్‌ చేస్తున్నారు.

● జీవో నంబర్‌ 57 ప్రకారం యూనిట్‌కు రూపాయిన్నర విద్యుత్‌ రాయితీని జూలై నుంచి అమలు చేయాలని, అర్హత లేని రైతులకు పత్రాలు ఇచ్చేందుకు రెండు మూడు నెలల గడువు ఇచ్చి అర్హత పొందిన వారికి కూడా అదే తేదీ నుంచి రాయితీ వర్తింపజేయాలని కోరుతున్నారు.

● కేంద్ర సంస్థ ద్వారా నేరుగా రొయ్యల కొనుగోలు విధానం ఏర్పాటు చేసి మధ్యవర్తులను తొలగించాలని, దీని వల్ల కిలోకు రూ.20 నుంచి రూ.30 అదనపు లాభం నేరుగా రైతులకే అందేలా చూడాలని కోరుతున్నారు.

సమస్యలపై రాష్ట్రస్థాయి సదస్సు

అవసరమైతే

పంట విరామంపైనా చర్చ

హాజరుకానున్న వనామీ సాగు రైతులు

ఫీడ్‌ రేట్లు నెల వ్యవధిలో రెండుసార్లు

పెంచడంపై ఆగ్రహంతో ఉన్న వైనం

ఈ నెల 9న సీఎం కోనసీమ పర్యటన

ఈ నేపథ్యంలో

సదస్సు నిర్వహణపై ఉత్కంఠ

ఇప్పటికే సీఎంతో

తేల్చుకుంటామని రైతుల అల్టిమేటం

అవసరమైతే ‘సాగు సమ్మె’..

రాష్ట్రస్థాయి సదస్సులో ఆక్వా రైతులు అవసరమైతే సాగు సమ్మైపె చర్చించనున్నారు. మేత ధరలు పెరుగుతున్న తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా)లో చర్చించకుండా ఏకపక్షంగా మేత కంపెనీలు ధరలు పెంచడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. అవసరమైతే సాగు సమ్మె చేయడానికి కూడా వారు వెనకాడటం లేదు. ఈ నెల తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సదస్సులో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చే సమయంలో ఆక్వా రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement