కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ఎన్నిక జరిగే పరోక్ష విధానం కొందరికి అనూహ్యంగా కలిసొచ్చింది. 2005లో అమలాపురంలో కాంగ్రెస్‌కు 14, టీడీపీకి 15 కౌన్సిలర్ స్థానాలు రాగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓటింగ్‌తో పాటు స్వతంత్ర కౌన్సిలర్ మద్దతు కీలకంగా మారడంతో నల్లా విష్ణుమూర్తి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో రామచంద్రపురంలోనూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్‌ఆర్‌కే గోపాల్‌బాబు 22వ వార్డులో కౌన్సిలర్‌గా ఓటమి చెందారు. దీంతో మరో కౌన్సిలర్ కొమ్మన నాగేశ్వరరావును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం నెల రోజులకు గోపాల్‌బాబును మరో వార్డు నుంచి కౌన్సిలర్‌గా చేయించి చైర్మన్ పదవిని అప్పగించారు. దీంతో పరోక్ష ఎన్నికల విధానం ఇద్దరు నేతలకు అనూహ్యంగా కలిసొచ్చిన విషయంగా నిలిచింది. ప్రత్యక్ష ఎన్నికల విధానం తిరిగి రావడంతో ఇక కౌన్సిలర్ల బలాబలాల కంటే ప్రజల మద్దతే చైర్మన్ అభ్యర్థుల విజయానికి కీలకం కానుంది. దీంతో కోనసీమలోని పురపాలక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేవనుంది.


