రంపచోడవరం: ఆరునెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి నాలుగు జిల్లాల పరిధిలోనే సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మత్తు మందు ఇచ్చి పులిని మొదటి నెలలోనే బంధించారు. తదనంతరం దానిని విశాఖ జూకు తరలించి, కొన్ని రోజులు సంరక్షణలో ఉంచిన తరువాత పోలవరం జిల్లా పరిధిలోని పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలో వదలిపెట్టారు. కొద్ది రోజులు అక్కడే ఉన్న పెద్దపులి ఆ తరువాత గిరిజన గ్రామాల వైపు వడివడిగా అడుగులు వేసింది. పశువులపై దాడి చేసి హతమార్చడం మొదలుపెట్టింది. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లో పులి సంచరించింది. అలాగే కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోనూ కొన్నాళ్లు పులి సంచరించింది. ఇప్పటి వరకు పులి ఆరు నెలలుగా ఒకే రూట్‌లో ప్రయాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం పులి అడ్డతీగల మండలం డి.కృష్ణవరం, గడిచిన్నంపాలెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అప్రమత్తం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నాలుగు జిల్లాల భూగంలోనే సంచారం
సాధారణంగా పులిని కొత్త అటవీ ప్రాంతంలో వదిలినప్పుడు కొంత భూభాగాన్ని తన నివాస ప్రాంతంగా ఎంచుకొంటుంది. అందుకోసం పులి కొన్ని గుర్తులను కూడా పెట్టుకొంటుంది. పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలో వదిలిపెట్టిన పెద్దపులి తన భూభాగాన్ని కాకినాడ, పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసుకున్నట్లు తేటతెల్లమవుతుంది. మగ టైగర్ సాధారణంగా 20 స్క్వేర్ కిలోమీటర్లు పరిధి భూభాగాన్ని తన పరిధిగా నిర్ధారించుకొంది. పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలోని కొండమొదలు ప్రాంతంలో పులిని వదలిపెట్టిన తరువాత రంపచోడవరం మండలంలోని రామన్నవలస, సున్నంపాడు మీదుగా రంప, పెద్దకొండ, తాళ్లపాలెం వెళ్లింది. అక్కడ నుంచి గంగవరం మండలంలో కుసుమరాయి నుంచి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లింది. అలాగే రాజవొమ్మంగి, శంఖవరం మండలాల అటవీ ప్రాంతంలో సంచరించింది. తరువాత తిరిగి అదే రూట్‌లో వెనక్కి వచ్చి దేవీపట్నం మండలం దండంగి వాగు, రామదుర్గం, కోరుకొండ మండలంలోని గ్రామాలకు వెళ్లి తిరిగి దండంగి ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. ఎక్కడ సాధ్యపడలేదు. తరువాత పులి గోదావరి దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆ జిల్లాలోని పాపికొండల అభయారణ్యం పరిధిలో సంచరించింది. రెండు రోజులు క్రితం పోలవరం ప్రాజెక్టు ఏరియా వద్దకు వచ్చిన పులి సింగనపల్లి వద్ద గోదావరి దాటి దేవీపట్నానికి చేరుకుంది. గతంలో ప్రయాణించిన రూట్‌లో తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. పెద్దపులి మైండ్‌లో రూట్ మ్యాపింగ్ జరిగింది. పులి తిరిగిన ప్రాంతంలో నీరు పుష్కలంగా లభిస్తుండడం, అడవిలో కష్టపడి వేట సాగించే అవకాశం లేకుండా పశువులు ఉండడంతో ఆహార సేకరణ సులభతరమవుతుంది. అటవీ అధికారులు పులి సంచారంపై కాలర్ ఐడీ చూడడం తప్ప అటవీ అధికారులు చేస్తోంది శూన్యమే. పులి సంచారంతో గిరిజనుల్లో భయం మళ్లీ నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పులి సంచారంపై అటవీ అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆరు నెలల నుంచి ఏలూరు, కాకినాడ, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకో మండలం, మూడు రోజులకో జిల్లా అన్నట్టుగా దాని పయనం సాగుతోంది. దాని కాలికి వేసిన కాలర్ ఐడీ సిగ్నల్స్‌తో అది ఎక్కడ ఉందో చెప్పడం తప్ప అధికారులు చేసిందేమీ లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు.
ఫ మళ్లీ పోలవరం జిల్లాలోకి పులి ప్రవేశం
ఫ పశువులపై దాడి
చేస్తుందేమోనని జనం భయం
ఫ గిరిజనుల్లో మొదలైన అలజడి


