అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే ఎస్పీ కార్యాలయంలోని తమ చాంబర్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వాటిని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు నిర్ణీత గడువులోగా కచ్చితంగా పరిష్కరించాలని ఎస్పీ మీనా ఆదేశించారు.
రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా!
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా.. టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజ వేస్తున్నారా అంటూ వినాయక్ ఈస్ట్ చిట్స్ ఫండ్ బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి అవసరాలకు ఉపయోగపడతాయని రూపాయి, రూపాయి పోగుచేసుకొని చీటి కడితే.. తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు బాధితుల సంఘ నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారి వినతి పత్రం సమర్పించారు. వందలాది మంది వద్ద చీటీలు కట్టించుకుని రూ.30 కోట్లకు టోకరా వేసిన చిట్స్ యాజమాన్యం, డైరెక్టర్లందరినీ తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల బాధలు పట్టించుకోకుండా చిట్స్ ఫండ్ యాజమాన్యానికి సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. చిట్స్ ఫండ్ చైర్మన్ శేతుమాధవరావు టీడీపీ నాయకుడు కావడం వల్లే పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుల సహకారంతో అతను ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నట్లు చెప్పారు. చిట్స్ ఫండ్ డైరెక్టర్లపై ఎటువంటి చర్య లు తీసుకోవడం లేదని, తాము ఇప్పటికే పలుమార్లు పోలీసులు, వివిధ శాఖల అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బాధితులు సలాది కుమారి, త్రినాథ్, ఎర్రంశెట్టి సత్యనారాయణమూర్తి, కోటిపల్లి విజయశ్రీ, కోటిపల్లి వీరరాఘవులు, కృష్ణవేణి, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా
వైఎస్సార్ సీపీ
పెద్దాపురం: కట్టమూరులో పచ్చకామెర్ల బాధితులను హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పరామర్శించారు. సోమవారం ఆ గ్రామ ఎస్సీ పేటలో బాధిత చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ ఎస్సీ పేటకు సక్రమంగా తాగునీరు రావడం లేదని వాపోయారు. కలుషిత నీటి సరఫరాపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామంలో చాలామంది చిన్నారులు, వృద్ధులు కామెర్లు, టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని వాపోయారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, పూర్తి స్థాయిలో సురక్షిత నీరు రావడం లేదని చెప్పారు. ఈ విషయంపై దవులూరి దొరబాబు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. కట్టమూరు గ్రామ ప్రజలకు వైఎస్సార్ సీపీ ఉంటుందని, తాను ప్రజల పక్షాన ఉండి పోరాటాలు సాగిస్తామని అన్నారు. గ్రామానికి రక్షిత నీరు సరఫరా చేసి, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు నల్లల గోవిందు సూర్యకుమారి, ఉప్పటి ప్రసాద్, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రంగనాథ్ శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మి, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు జ్వోతుల నాగు, జెస్సీ, భూషణం, జీను వెంకటరమణ, జి.రాజు, జి.ఆనంద పాల్గొన్నారు.


