● అన్యాయాలను ప్రశ్నిస్తే కక్షసాధింపు
● తమ్మన అక్రమ అరెస్ట్ దారుణం
● వంతెనల విషయంపై
ప్రశ్నించినందుకే టార్గెట్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
జగ్గిరెడ్డి ఆగ్రహం
ఆలమూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసును అరెస్ట్ చేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. లంక గ్రామాల్లోని వంతెనల క్రెడిట్ చోరీపై ప్రశ్నించినందుకు కూటమి నేతలు తట్టుకోలేక తమ్మనను అక్రమంగా అరెస్ట్ చేయించి, అన్యాయంగా 14 రోజుల రిమాండ్‌కు కారణమయ్యాయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ అరెస్ట్‌ల విష సంస్కృతిని కూటమి ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 15 ఏళ్ల కాలంలో ఎవ్వరిపైనా కక్ష సాధింపునకు పాల్పడలేదని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వైఎస్సార్ హయాంలోనే మంజూరు
మూలస్థాన అగ్రహారం, బడుగువానిలంకలో నిర్మించిన వంతెనలు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మంజూరయ్యా యని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి ఆ వంతెనలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆ వంతెనలకు ప్రస్తుత ఎమ్మెల్యే సత్యా నందరావు తమ సొంత పేరు పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వాటికి గ్రామ దేవతల పేర్లు పెట్టేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఏకపక్షంగా నిర్ణయించుకున్నారని తెలిపినందుకే తమ్మన కూటమి నేతలకు టార్గెట్ అయ్యారన్నారు. అధికారికంగా అనుమతులు లేకపోయినా, నిధుల మంజూరులో ప్రమే యం లేకపోయినా ఆ వంతెనలకు పేర్లు పెట్టాలనుకోవడం కూటమి ప్రభుత్వం విష సంస్కృతికి నిదర్శనమన్నారు.


