● సమన్వయంతో ముందుకు సాగాలి
● అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఇతర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం కావాలన్నారు. మొదటిగా మున్సిపల్ ఎన్నికలు, తదుపరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. 2026 జనవరి నెల వరకు ఉన్న ఓటర్లతో జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి నివేధిక పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికలకు..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో వార్డుల వారీగా సెప్టెంబర్ 3 నాటికి డ్రాఫ్ట్ ఓటరు జాబితాను, సెప్టెంబర్ 30న తుది జాబితా ప్రచురించి, రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పనులన్నీ సజావుగా జరిగేందుకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు తమ పరిధిలోని ఆర్డీవో, తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.
జిల్లాలో 342 పంచాయతీలు
జిల్లాలో 342 పంచాయతీలకు సంబంధించి ఆగస్టు 23న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వేను సెప్టెంబర్ 7 నాటికి పూర్తి చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక పంపించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా పంచాయతీ కార్యాలయం, కలెక్టరేట్‌లో ప్రత్యేక ఎన్నికల సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలపై అధికారులు స్పష్టమైన అవగాహన పెంపొందించుకుని ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు.
బోటు ఘటనపై కోస్ట్‌గార్డ్‌కు సమాచారం
అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన మత్స్యకార బోటు విషయాన్ని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు తక్షణమే సమాచారం అందించాలని, గాలింపు, రక్షణ చర్యలకు సహకారం అందించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన బోటు 13న తిరిగి రావాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చేరుకోలేదన్నారు. బోటులో సుమారు 15 రోజుల పాటు సరిపడే రేషన్, 1,000 లీటర్ల డీజిల్ ఉందని, విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు చేపల వేటకు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. బోటులో యజమాని కమ్ డ్రైవర్ కొప్పనాతి రామకృష్ణ వర్మతో పాటు మొత్తం 8 మంది మత్స్యకారులు దానిలో ఉన్నారన్నారు. బోటులోని మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లేదన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందిస్తూ, వారి భద్రత కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటి కప్పుడు వివరాలు తెలియజేయాలన్నారు.


