పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లువ

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

కలెక్టరేట్‌కు పోటెత్తిన ప్రజలు

216 అర్జీలు అందుకున్న అధికారులు

అమలాపురం రూరల్‌: అమలాపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూసర్వే, తాగునీరు, ప్రభుత్వ పథకాలు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. పలుమార్లు వచ్చి అర్జీలు ఇస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌కు భూ సమస్యల ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌లో 216 అర్జీలను కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, జేసీ నైదియా దేవి, డీఆర్‌వో సుబ్బారావు, పీజీఆర్‌ఎస్‌ ఎస్డీసీ డి.అచ్యుత కుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డ్వామా పీడీ రామ్‌గోపాల్‌ అందుకున్నారు. వాటిని నిబంధనల ప్రకారం సకాలంలో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు.

కోనసీమ రైల్వే పనులు వేగవంతం చేయాలి

కోనసీమ రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కోనసీమ జేఏసీ ప్రతినిధులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జేఏసీ కన్వీనర్‌ బండారుల రామోహ్మనరావు, ప్రతినిధులు అన్యం రాంబాబు, ఇళ్ల భక్తవత్సలం, పమ్మి నాగేశ్వరరావు, నూకల శ్రీనివాస్‌, రంకిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి, భూసేకరణకు అవసరమైన నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య షేరింగ్‌పై స్పష్టత లేకపోవడం పనులు వేగవంతం కాకపోవడానికి ఒక కారణమని తెలిపారు.

భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో జనతా వారధి జిల్లా కన్వీనర్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్‌ చీకరమెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జేసీ వైఖోమ్‌ నైదియాదేవికి వినతిపత్రం అందించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడుగుంటల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

నేతన్న సేవ సాయం రాలేదు

దాదాపు 40 ఏళ్లుగా చేనేత వృత్తి కొనసాగుతున్నాను. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నేతన్న సేవ పథకంలో నాకు రూ.25 వేల సహాయం అందలేదు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె బండారులంక గ్రామంలో ఉంటారు. ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆమె నా రేషన్‌ కార్డులో ఉండడంతో పథకం వర్తించలేదని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే నా కుమార్తెకు వివాహం జరిగింది. అప్పట్లో నేతన్న నేస్తం పథకం తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఎన్నోసార్లు సచివాలయం అధికారుల చూట్టూ తిరుగుతూ కుమార్తె పేరును నా రేషన్‌ కార్డు నుంచి తొలగించాలని విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. – నల్లా భైరవరావు, విలసవిల్లి,ఉప్పలగుప్తం మండలం

భూ సమస్యకు పరిష్కారమెప్పుడు?

కాకినాడ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాను. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం ఎర్రగరువులో సర్వే నెంబర్‌ 360 /10లో నా తల్లి జయలక్ష్మి పేరు మీద 83 సెంట్ల భూమి ఉంది. తల్లి నుంచి వాటాగా వచ్చి ఆ భూమిని నా కుతురుకు ఇచ్చాను. భూమి నా అధీనంతో ఉన్నా 2012లో మా వదిన చిట్టిమేను విజయలక్ష్మి పేరుపై అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీనిపై ఐ.పోలవరం తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనిపై కలెక్టర్‌కు పీజీఆర్‌స్‌లో గతంలో ఫిర్యాదు చేస్తే, 75 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు పీజీఆర్‌ఎస్‌లో జేసీకి నైదియాదేవికి ఫిర్యాదు చేయగా ఆర్డీవో కోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారు.

– చిట్టుమేను వెంకటేశ్వర్లు, సామర్లకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement