● ఆహ్లాద ప్రయాణాల్లో విషాదం
● కాలువల పక్కనే ప్రమాదకరంగా రోడ్లు
● దూసుకుపోతున్న వాహనాలు
● పలువురి మృత్యువాత
ఆలమూరు: కాలువల పక్కన రహదారులపై ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. వాటి వెంబడి రక్షణ చర్యలు లేకపోవడం, అంచనా వేయలేని మలుపులు, గమ్యం చేరాలనే ప్రయాణికుల ఆతృత, నిద్రలేమి తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పచ్చని పంట పొలాల మధ్య, కొబ్బరి చెట్ల పక్క నుంచి ఆహ్లాదకరంగా సాగే ప్రయాణం ఒక్కోసారి విషాదమయం అవుతోంది. కాలువల పక్కనే రెయిలింగ్ నిర్మాణాలు చేపట్టకపోవడం, దారిలో కల్వర్టులు కుంగిపోవడం, రోడ్లు గోతులమయంగా మారడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాములోనే కాలువల్లో వాహనాలు దూసుకుపోతున్నాయి.
కాలువలే మృత్యుకూపాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1573.68 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ప్రాంత రహదారులు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధిక భాగం తూర్పు, మధ్య డెల్టా కాలువల వెంబడి రహదారులు ఉన్నాయి. జిల్లాలో అత్యధిక భాగం రోడ్లు కాలువలు, చెరువుల చెంతనే ఉండటంతో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంది. గడచిన రెండు దశాబ్దాలుగా జిల్లా పరిధిలోని పలు మండలాల్లో కాలువల్లోకి వాహనాలు దూసుకువెళ్లిన ఘటనలు చాలా జరిగాయి.
రక్షణ కరవు
జిల్లా పరిధిలోని అనేక ప్రధాన పంట కాలువల పక్కనే ఉన్న రోడ్లకు బెర్మ్‌లు కూడా సక్రమంగా ఉండడం లేదు. ప్రమాదకర ప్రదేశాల వద్ద అధికారులు హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా తాటిమఠం నుంచి చాకలిపాలెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఆలమూరు నుంచి యానాం వరకూ ఉన్న ఏటిగట్టు రోడ్డు పక్కన ఉన్న కోరింక పంట కాలువ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. కొత్తపేట నుంచి అమలాపురం వెళ్లే పంట కాలువకు రక్షణ చర్యలు తీసుకోలేదు.
పలు ప్రమాదాలు
● పి.గన్నవరం ప్రధాన కాలువలో 2012 మార్చి 12న కారు దూసుకువెళ్లిన సంఘటనలో మండపేటకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.
● విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ముంచింగి పుట్టకు చెందిన సుమారు 40 మంది కూలీలు ఒంగోలులో పనులు ముగించుకుని సిమెంట్ లారీపై 2012 జూలై 18న స్వగ్రామం వెళుతుండగా ఏటిగట్టు జంక్షన్‌లోని తూర్పు డెల్టా పంట కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద పడి ఆరుగురు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
● 2016 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం విస్సాకోడేరుకు చెందిన 11 మంది పెళ్లి బృదం ఇన్నోవా కారులో అన్నవరం వెళుతుండగా అదే ప్రదేశంలోని పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహ ఒక వ్యక్తి మృతి చెందగా, వధూవరులతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
● 2019 నవంబర్ నాలుగున చైన్నె నుంచి హుండ్యాయ్ కార్ల లోడుతో వెళుతున్న కంటైనర్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ మృతి చెందారు.
● పి.గన్నవరం మండలం ఊడుమూడి శివారు చింతావారిపేట వద్ద 2024 డిసెంబర్ 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి చెందింది.
● మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటి పాకల వద్ద ఈ ఏడాది ఏప్రిల్ ఐదున అర్ధరాత్రి తాపేశ్వరం లాకుల సమీపంలో పంట కాలువలోకి దూసుకువెళ్లిన సంఘటనలో భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. ఇద్దరు వృద్ధులు, ఒక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.
● సఖినేటిపల్లి మండలం అయితంపూడి లాకుల వద్ద 2026 ఆగస్టు 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు నరసాపురం పంట కాలువలో పడి మృతి చెందారు. పంట కాలువ మలుపుల వద్ద రక్షణ చర్యలు లేకపోవడం, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది.


