సాక్షి, అమలాపురం: మరో డీఎస్సీపై నిరుద్యోగులు పెంచుకున్న ఆశలు క్రమంగా ఆవిరవుతున్నట్టు ఉంది పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు ఉపాధ్యాయుల శాశ్వత నియామకాల స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అమలైతే నిరుద్యోగులకు అశనిపాతమేనని చెప్పక తప్పదు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో మొత్తం 136 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశం ఉంది. జిల్లాలో గణితం, భౌతిక, జీవశాస్త్రాలు, ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరత చాలా కాలంగా సాగుతోంది. ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై విద్యాశాఖ వర్గాల్లో నాణ్యమైన విద్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎదురుతెన్నులు చేస్తున్నారు. గత ఏడాది డీఎస్సీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 పోస్టులు భర్తీ అయ్యాయి. చాలా మంది ఆశావహులకు అవకాశాలు రాకపోవడంతో ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగినట్టుగానే త్వరలో మరో డీఎస్సీ ప్రకటిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన వారిలో ఆశలు రేకెత్తించింది. కానీ తాజాగా ఔట్‌సోర్సింగ్‌పై ఉపాధ్యాయులను నియమించనున్నారన్న కబుర్లు వినిపిస్తుండడంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ఉద్యమబాట
చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలతో ఇప్పటికే వైఎస్సార్ సీపీ దశలవారీగా ఉద్యమిస్తోంది. జిల్లాలో సైతం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గురువారం నుంచి మండలాల వారీగా రిలే దీక్షలు చేపట్టనున్నారు. తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ చేయనున్నారు.
సబ్జెక్టు టీచర్ల భర్తీకి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల
నియామకానికి ప్రతిపాదనలు
కోనసీమ జిల్లాలో
136 ఖాళీల భర్తీకి అవకాశం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు


