అమలాపురం రూరల్: మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ రాహుల్ మీనా, వివిధ శాఖల అధికారులతో కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ చర్యల పురోగతిపై సమీక్షించారు. ఆగస్టు 6 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందన్నారు.
ఆక్రమణలపై దృష్టి పెట్టాలి
నీటిపారుదల వనరుల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ జిల్లా అధికారులను టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు. జిల్లాలోని కాలువలు, చెరువులు, డ్రైన్లు, ఇతర నీటిపారుదల వనరులపై జరిగిన ఆక్రమణలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు.
అందుబాటు ధరల్లో పశువుల మేత
పాడి రైతులకు నాణ్యమైన పశువుల మేతను అందుబాటు ధరల్లో సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో సాయి శివ హోమ్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్, పశుసంవర్ధక శాఖ అధికారులు, పీఏసీఎస్ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 150 టన్నుల పశుదాణా ఉత్పత్తి చేశామని, ఎంఓయూ ప్రకారం సెప్టెంబర్ నెల నాటికి గడువు పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు.
7న మినీ ఉద్యోగ మేళా
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్‌లో వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ మాట్లాడుతూ జాబ్‌మేళాలో ఎన్‌ఐఐటీ–ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధించిన రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ మహేష్ కుమార్


