అమలాపురం రూరల్: మండలం బండారులంక గ్రామ దేవత గంగాదేవి మురులమ్మ తల్లి బుధవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. గ్రామ ఆడపడుచులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు
సఖినేటిపల్లి: మండల పరిధిలోని ఉయ్యూరువారి మెరక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన దోపిడీ ఘటనకు సంబంధించి బుధవారం నిందితుడు కొప్పాడి నాగరాజును అరెస్ట్ చేసి రాజోలు న్యాయ ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. దోపిడీ ఘటనపై గ్రామానికి చెందిన పేరిచర్ల రంగరాజు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై అన్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడు కొప్పాడి నాగరాజును అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
సఖినేటిపల్లి: అంతర్వేది రోడ్డు సెంటర్‌కు సమీపంలో బుధవారం రాజోలు ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. సఖినేటిపల్లి నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి, ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న టీ దుకాణం వైపు దూసుకువెళ్లింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులకు ఏమీ కాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలైనట్టు సమాచారం.
నాగంపల్లిలో చోరీ కేసు నమోదు
సీతానగరం: మండలంలోని నాగంపల్లిలో ఉద్దగిరి అనంతలక్ష్మి ఇంట్లో చోరీ జరిగిందని, కేసు నమోదు చేశామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ బుధవారం తెలిపారు. కొంతకాలంగా ఆమె కాకినాడలో నివసిస్తోందని, పెన్షన్ కోసం నాగంపల్లి వచ్చి తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండడాన్ని చూసి లోపల గమనించగా ధాన్యం బస్తాలు, రాగి, ఇత్తడి సామాన్లు, తులం బంగారు ఉంగరం, అరకాసు దుద్దులు, లక్ష రూపాయలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మంగళవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదుతో క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


