బోడసుకుర్రు – పాశర్లపూడిలంక మధ్య వైనతేయ నదీపాయపై వంతెన
వైఎస్సార్ హయాంలో నిర్మించిన అన్నంపల్లి అక్విడెక్టు
చిరునవ్వే ఆభరణంగా, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, బడుగులు, పేదల అభ్యున్నతే ఆశయంగా పాలన సాగించిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. వినూత్న సంక్షేమ పథకాలతో పేదల ఇంట్లో కాంతులు నింపారు.
విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. వ్యవసాయానికి పండగ చేస్తూ అన్నదాతల జీవితాల్లో ఆనందం నింపారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
ఆయకట్టుకు నీరు
పాత అక్విడెక్టు శిథిలావస్థకు చేరడం వల్ల రబీలో శివారు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయేవి. అన్నంపల్లి అక్విడెక్టు కట్టిన తర్వాత దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. వరితో పాటు కొబ్బరికి సాగునీరు, 12 గ్రామాలకు చెందిన సుమారు లక్ష మందికి సరిపడా తాగునీరు అందుతోంది. కొత్త అక్విడెక్టు కాలువలో నీరు చూస్తే సంతోషంగా ఉంటుంది. ఇది మా జీవనాడి.
– గుబ్బల రామకృష్ణ,
కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం
డెల్టా ఆధునీకరణ పూర్తయ్యేది
వైఎస్సార్ బతికే ఉంటే అప్పట్లోనే డెల్టా ఆధునీకరణ పూర్తయ్యేది. ఆయన హయాంలో పెద్ద ఎత్తున జరిగిన పనులు ఆ తర్వాత నిలిచిపోయాయి. దీని వల్ల ఖరీఫ్‌లో ముంపునీరు దిగడం లేదు. రబీలో శివారుకు సాగునీరందడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మురుగునీటి కాలువలను జీరో కిలోమీటర్ నుంచి ఎగువకు తవ్వకాలు చేయాలనే ప్రతిపాదనలు జరిగాయి. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలి.
– జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
సులువైన రాకపోకలు
బోడసుకుర్రు వంతెన రాకముందు రాజోలు దీవికి రావాలంటే పడవే దిక్కు. హాస్పిటల్‌కు వెళ్లాలన్నా, పంట అమ్మాలన్నా అవస్థలు పడేవాళ్లం. బోడసకుర్రు, పాశర్లపూడి వంతెనలు వచ్చిన తర్వాత రాకపోకలు సులువుగా జరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు, రైతులు, వ్యాపారులకు చాలా ఉపయోగంగా ఉంది. సమయం, ఖర్చు ఆదా అవుతున్నాయి.
– పోతుమూడి గోపాలకృష్ణ, బి.దొడ్డవరం,
మామిడికుదురు మండలం.
కోనసీమ అభివృద్ధికి రాజన్న ప్రాధాన్యం
డెల్టా ఆధునీకరణకు రూ.1,160 కోట్లు
మురుగు కాలువలకు రూ.550 కోట్లు
ఏటిగట్ల పటిష్టతకు రూ.650 కోట్లు
అన్నంపల్లి అక్విడెక్టుకు రూ.48 కోట్లు
గ్రోయిన్ల నిర్మాణం
దివగంత నేత రాజశేఖరరెడ్డి హయాంలో రైతుల విజ్ఞప్తి మేరకు మా బడుగువానిలంక చుట్టూ గ్రోయిన్ల నిర్మాణం చేశారు. దీని వల్ల మా పంట పొలాలు నదీ కోతకు గురి కాకుండా ఉన్నాయి. గతంలో ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు చెందిన ఒకటి, రెండు ఎకరాల నదిలో కలిసిపోయాయి. గ్రోయిన్ల నిర్మాణం తర్వాత నదీ కోత ఆగింది. ఆయన హయాంలోనే తూర్పు డెల్టా కాలువపై వంతెనకు అంకురార్పణ జరిగింది.
– కటారి గంగరాజు, రైతు,
బడుగువానిలంక, ఆలమూరు మండలం
సాక్షి, అమలాపురం: రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలం ఓ స్వర్ణయుగం. అప్పటి వరకూ సాగిన నిరంకుశ పాలన నుంచి ప్రజలను కాపాడిన మహానుభావుడు ఆయన. కుదేలైన వ్యవసాయ రంగానికి ఊపిరి పోసి, జలయజ్ఞంతో పచ్చదనాన్ని పండించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు భరోసా కల్పించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు.. ఇలా సమాజంలో అన్ని తరగతుల ప్రజలు ఆయన పాలనలో ఏదో ఒక సంక్షేమ పథకంలో లబ్ధి పొందిన వారే. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి కార్యకలాపాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. వంతెనల నిర్మాణంతో పాటు కాలువలను ఆధునీకరించారు.
ఆధునీకరణకు పెద్దపీట
గోదావరి డెల్టా రూపశిల్పి సర్ ఆర్థర్ కాటన్ తర్వాత డెల్టా ఆధునీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెద్దపీట వేశారు. పంట కాలువల ఆధునీకరణకు రూ.1,160 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.550 కోట్లు కేటాయించారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో 10.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ముంపు నీరు తొలగింపు చర్యలు చేపట్టారు.
పోలవరంతో కొత్తగా 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు, డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు కృషి చేశారు. ఐ.పోలవరం (ఐలాండ్) రైతుల కోసం అన్నంపల్లి అక్విడెక్టు నిర్మాణానికి రూ.48 కోట్ల నిధులిచ్చారు.
రైతుల కోసం ప్రవేశపెట్టిన జిల్లాలో 20,452 వ్యవసాయ మోటార్లలో 11,901 పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. 2008 రబీలో నీటి ఎద్దడి సమయంలో రూ.7.50 కోట్లతో డ్రెయిన్లపై క్రాస్‌బండ్లు, మోటార్లతో నీటి మళ్లించి డెల్టాలో 4.80 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టును బతికించారు. 2007 కొబ్బరి సంక్షోభంలో కొత్త కొబ్బరిపై రెండు శాతం వ్యాట్ మినహాయింపు, కేజీ రూ.9.20కి కొనుగోలు చేయించారు.
2006 వరదల్లో ఏటిగట్లు తెగడంతో రూ.550 కోట్లు కేటాయించి, రూ.650 కోట్లతో ఏటిగట్ల పటిష్ట పనులు చేపట్టారు. 70 శాతం పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. గోదావరి కోత నివారణకు రూ.90 కోట్లతో గ్రోయిన్లు, రివిట్‌మెంట్లు నిర్మించారు.
కోనసీమను సెంటిమెంట్‌గా భావించే ఆయన రాష్ట్రంలో రాజీవ్ గృహకల్పకు అమలాపురం నల్లమిల్లిలో, ఇందిరమ్మ ఇళ్లకు అల్లవరంలో శంకుస్థాపన చేశారు.


