ఐ.పోలవరం: ఎక్కడైనా బస్‌షెల్టర్లు నిర్మించారంటే అది ప్రయాణికులకు ఉపయోగపడేలా నిర్మిస్తారు. 216 జాతీయ రహదారిపై మాత్రం వింతగా గ్రామాలకు కిలోమీటరు దూరంలో బస్‌షెల్టర్లు నిర్మించారు. పోనీ బస్సులైనా ఆ షెల్టర్ల ఆపుతారా అంటే.. అది మాత్రం మెయిన్‌రోడ్డు వద్దే.. దాంతో షెల్టర్లు ఉన్నా.. ఉపయోగం లేకుండా పోతున్నాయి. బస్సు ఎక్కాల్సిన ప్రయాణికులు ఎండకు ఎండి, వానకు తడిచి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇటు ప్రయాణికుల కోసం నిర్మించిన బస్సుషెల్టర్లు మాత్రం నిరూపయోగంగా, నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ రహదారి కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు సాగే ఈ రహదారి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల గుండా ఒంగోలు వరకూ వెళుతుంది. అమలాపురం నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, భీమవరం, నర్సాపురం, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. వీటి ద్వారా రోజూ వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అమలాపురం–కాకినాడ, అమలాపురం–భీమవరం మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటుంది.
అక్కడికి వెళ్లాలంటే కిలోమీటర్
ఎన్‌హెచ్ అధికారులు నిర్మించిన బస్‌షెల్టర్లు మాత్రం గ్రామాలకు చాలా దూరంగా ఉన్నాయి. ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలం మురమళ్ల, పుదిచ్చేరి యానాం జంక్షన్, అమలాపురం మండలం పేరూరు, తాళ్లరేవు మండలం కోరంగి, చొల్లంగి వంటి ప్రాంతాల్లో షెల్టర్లు ఊరికి సెంటర్‌కు అర కిలోమీటరు నుంచి కిలోమీటరు దూరంలో ఉన్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు వాటి వరకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ అక్కడికి వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించాలి. ఇదే సమయంలో ఇక్కడ బస్సులు ఆగవు. ఫలితంగా బస్సులు ఆగే ప్రధాన రహదారి పక్కనే నిలబడి ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కోనసీమ జిల్లాలోనే కాకుండా కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
మురమళ్ల, ముమ్మిడివరంలో దారుణం
ఐ.పోలవరం మండలం మురమళ్లలో నాన్‌స్టాప్ బస్సులు తప్ప అన్ని విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ ప్యాసింజర్, అమలాపురం బస్సులు ఆగుతాయి. మండల ప్రజలందరూ ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. కానీ ఇక్కడ ప్రయాణికులు కూర్చునేందుకు కనీస సౌకర్యం కూడా లేదు. ఎండకు ఎండి, వానకు తడిచి రోడ్డు పక్కనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ గతంలో ఆర్టీసీ బస్టాండ్ ఉండేది. దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఆర్టీసీ స్థలంలో గజం స్థలం కూడా ప్రయాణికుల కోసం ఇవ్వలేదు. దీంతో ప్రజలంతా రోడ్డుపైనే నిలబడి బస్సులు ఎక్కాల్సిన దుస్థితి.
వింత నిర్మాణాలు
అమలాపురం పేరూరు జంక్షనన్‌కు దూరంగా ఒక బస్ షెల్టర్ నిర్మించారు. కానీ ఇటువైపు ఆర్టీసీ బస్సుల రాకపోకలే లేవు. మరోవైపు భీమవరం, రాజోలు వెళ్లే బస్సులు ఆగే చోట మాత్రం ఎలాంటి సౌకర్యం లేదు. అలాగే మామిడికుదురు, యానాం బైపాస్ రోడ్డు, ఐ.పోలవరం మండలం కొమరగిరి వంటి ప్రాంతాల్లోనూ ఊర్లకు దూరంగా షెల్టర్లు నిర్మించారు. వాటిని ఎందుకు అక్కడ కట్టారో ఎన్‌న్‌హెచ్ అధికారులకే తెలియాలి. ప్రజల సౌకర్యం కోసం కోట్లు వెచ్చించి కట్టిన షెల్టర్లు నిరుపయోగంగా మారగా, ప్రయాణికులు మాత్రం రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి బస్సులు ఆగే ప్రాంతాల్లో షెల్టర్లు నిర్మించి వాటి వద్ద తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
216 జాతీయ రహదారిపై
మామిడికుదురుకు
దూరంగా బస్‌షెల్టర్
యానాం బైపాస్‌లో జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన బస్‌షెల్టర్
ఫ షెల్టర్లు ఉన్నా.. ఉపయోగం సున్నా
ఫ ఊరికి దూరంగా నిర్మాణాలు
ఫ జాతీయ రహదారిపై వింతలు
ఫ రోడ్డుపైనే ప్రయాణికుల పడిగాపులు


