మామిడికుదురు: రోడ్లను అభివృద్ధి చేశామని, 90 శాతానికి పైగా రోడ్లు ఆధునీకరించామని పాలకులు చెబుతున్నా.. ఇంకా అనేక రహదారుల్లో ప్రయాణించాలంటేనే జనం బెదిరిపోయేలా ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక మాదిరి వర్షానికే రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏడాది క్రితం వేసిన రోడ్లు సైతం దిగబడిపోయాయన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ పయనిస్తున్నారు. సీసీ రోడ్లు సైతం ముక్కలు, ముక్కలుగా విరిగిపోయాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
గోతుల మయం.. అప్పనపల్లి రోడ్డు
అప్పనపల్లి పంచాయతీ నుంచి సాకావారిపేట వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడి ఆ గోతుల్లో ఒక మాదిరి వర్షానికే నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు కిలోమీటరు పైబడి ఉన్న ఈ రోడ్డు అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాశర్లపూడి కరకట్ట దిగువ నుంచి కాజ్‌వే సమీపాన పెంకుడుశాల వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దినదిన గండంగా ప్రయాణం
మామిడికుదురు నుంచి గోగన్నమఠం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డును ఏడాది క్రితమే బీటీ రోడ్డుగా ఆధునీకరించారు. రోడ్డు చక్కగా ఉందని అని ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటే అన్న విధంగా ఈ రోడ్డు పలు చోట్ల దిగబడిపోయింది. మామిడికుదురు బుల్లోడు వంతెన దగ్గర నుంచి మొదలు మగటపల్లి సరిహద్దు వరకు కాలువగట్టు వైపు రోడ్డు భారీగా దిగబడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును మళ్లీ చక్కదిద్ది దీన్ని ఆధునీకరించాలని కోరుతున్నారు.
ముక్కలుగా విరిగిన సీసీ రోడ్డు
పాశర్లపూడి కుసుమవారిపేటకు వెళ్లే కాంక్రీట్ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉన్నా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డు సమస్యను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
ఫ రహదారుల పరిస్థితి అధ్వానం
ఫ రోడ్లు అభివృద్ధి చేయాలని
స్థానికుల డిమాండ్
ఫ మూణ్ణాళ్ల ముచ్చటగా
మారుతున్న రోడ్లు
దారి దిగబడిపోయింది
మామిడికుదురు నుంచి గోగన్నమఠం వెళ్లే రోడ్డు చాలా చోట్ల దిగబడిపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు వేసిన ఏడాదికే పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అభివృద్ధి చేయాలి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– చింతా ఏసుబాబు, కొమరాడ
ఆదుర్రు రోడ్డును బాగు చేయండి
ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయంగా ఉంది. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ఫలితం శూన్యం. ఈ రోడ్డును అభివృద్ధి చేయాలి. దీంతో పాటు ఆదుర్రు నుంచి ధనమ్మ ఆలయం మీదుగా లూటుకుర్రు వెళ్లే రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్ల ఆధునీకరణపై దృష్టి సారించాలి.
– నాగాబత్తుల శ్రీకృష్ణ, ఆదుర్రు
అప్పనపల్లి రోడ్డును పట్టించుకోరా!
అప్పనపల్లి గ్రామ పంచాయతీ నుంచి బి.దొడ్డవరం వెళ్లే రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. అర కిలోమీటరు పొడవున్న ఈ రోడ్డును అభివృద్ధి చేయాలి. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించాలి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గెడ్డం ఏసుదాసు, పెదపట్నంలంక
జారుతున్నా.. పట్టించుకోరా!
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయం వద్ద జరుగుతున్న అన్నపూర్ణ నిలయం(అన్నదాన సత్రం) భవనం, ఉపాలయాల నిర్మాణ పనులతో స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవన నిర్మాణ పునాదుల్లో మట్టి వేసేందుకు మట్టి ట్రాక్టర్లు తిరగడంతో స్వామివారి ఆలయానికి వచ్చే రహదారి బురదతో నిండుతోంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది భక్తులైతే అ బురదలో జారిపడి అవమానంగా భావిస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన తమకు దుస్తులు బురదతో పాడవడంతో స్వామి దర్శనం చేసుకోవాలా! లేదా! అని మండిపడుతున్నారు. ఈ రహదారులు బురద కాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని ఆలయ నిర్వాహకులను భక్తులు కోరుతున్నారు.


