ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
● వైభవంగా ముక్కోటి ఏకాదశి
● ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం
● ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కొత్తపేట: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివార్లకు భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం భూలోక వైకుంఠంలా మారింది. ఆలయంతో పాటు ప్రాంగణం, వైకుంఠ ద్వారం, అంతరాలయాలను పుష్పాలతో విశేషంగా అలంకరించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు మంగళవారం తెల్లవారుజామున తిరుమల తరహాలో ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ఉత్సవ మూర్తులను, శేషపాన్పుపై ఉన్న స్వామివారిని, అనంతరం ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాల్లో భాగంగా గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.
రూ. 17.72 లక్షల ఆదాయం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఒక్కరోజే రూ.17,71,782 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. గత ఏడాది ముక్కోటికి రూ.5,79,678 వచ్చిందన్నారు.
అప్పనపల్లిలో..
మామిడికుదురు: అప్పనపల్లిలోని బాల బాలాజీ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు.
అంతర్వేదిలో..
సఖినేటిపల్లి: అంతర్వేదిలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యాన అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు.
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం


