ఉద్యోగ అవకాశాలు పెరగాలి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉద్యోగాలూ కల్పించలేదు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. క్వాంటం కంప్యూటర్స్, గూగుల్ డేటా సెంటర్లు కేవలం వైజాగ్ వరకే పరిమితమవుతున్నాయి. కోనసీమ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాలి. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ దిశగా కొత్త సంవత్సరంలోనైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం.
– సత్తి నాగ పల్లారెడ్డి, బీకాం కంప్యూటర్స్, రావులపాలెం
పాత పెన్షన్ విధానం కావాలి
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టెట్ పరీక్షల నుంచి 2010కు ముందున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వ కొత్త సంవత్సరంలో ఇస్తుందని ఆశిస్తున్నాను.
– కటకటాల చంద్రశేఖర్, పీఆర్టీయూ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు, గుడిమళ్లంక, మలికిపురం మండలం
పంటకు లాభసాటి ధర ఇవ్వాలి
రైతులు పండించే పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. పండించిన పంటకు లాభసాటి ధర ఇవ్వాలి. వరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సాధారణ రకం బస్తా (75 కేజీలకు)కు కనీసం రూ.రెండు వేలు నిర్ణయించాలి. జగన్ ప్రభుత్వంలో అమలు చేసినట్టుగా ఉచిత పంటల బీమా విధానాన్ని తీసుకు రావాలి. పంట నష్టపోయిన రైతులకు మూడు నెలల్లో పెట్టుబడి రాయితీ ఇవ్వాలి.
– గుణ్ణం రామకృష్ణ, రైతు, కొత్తూరు, రామచంద్రపురం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు
మరో రెండు నెలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటాను. మెడికల్ రంగంపై ఆసక్తితో బైపీసీ చదువుతున్నాను. మెడికల్ సీట్ పొందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. అప్పుడే అందరికీ మేలు కలుగుతుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చదవడం ఖర్చుతో కూడుకున్నది. నూతన సంవత్సరంలో విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు చేస్తారని ఆశిస్తున్నాను.
– ఎ.అంజలీదేవి, అంగర, కపిలేశ్వరపురం మండలం
మహిళలకు లబ్ధి కలగాలి
కొత్త సంవత్సరంలో మహిళలకు వ్యక్తిగత, ఆర్థిక భద్రత రావాలి. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని కొత్త ఏడాదిలోనైనా అమలు చేయాలి. మహిళకు ఇతర పథకాల లబ్ధి కూడా కలగాలి. వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనివ్వాలి.
– చెల్లి రమాదేవి, కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం
వ్యాపార రంగం తేరుకోవాలి
జిల్లాలో వ్యాపార రంగం తీవ్ర ఒడిదొడుకులకు గురైంది. బంగారం, వెండి ధరల్లో అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభానికి అనుగుణంగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. చూసిన వారికి ఈ రెండింటి ధరలు పెరిగాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా కొందరు వ్యాపారులు మార్కెట్ హెచ్చుతగ్గులపై సరైన అవగాహన లేక నష్టపోయారు. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులు ఆచితూచి లావాదేవీలు చేయాలి. కొత్త సంవత్సరంలో ప్రతి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
– అనిల్ జైన్, రాష్ట్ర బంగారు వర్తక సంఘం కోశాధికారి, అమలాపురం
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
ఉద్యోగ అవకాశాలు పెరగాలి


