‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్కల కొట్లాట వంటిదని కృష్ణుడికి ధర్మరాజు విన్నవించుకుంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సిందిగా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మరాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పోయి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని మేం అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ధర్మజుడి మాటల్లో ఆయన శరణాగతి కనపడుతోందని అన్నారు. ఇక కర్ణ దుర్యోధనులది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని వ్యాఖ్యానించారు. ‘‘అర్జునుడిని ఎదుర్కోవడానికి తగిన వాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే తలంపుతో దుర్యోధనుడి అండ చేరాడు కర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆదర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్య నిర్వహణకు వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నారు. సంజయునికి ధృతరాష్ట్రుడు కృష్ణ తత్త్వాన్ని వివరిస్తాడన్నారు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలో ఉన్న జీవుడు ఒకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్న జీవుడు మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.


