బ్యాంకు ఉద్యోగుల ధర్నా
అమలాపురం టౌన్: యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు కోనసీమలోని అన్ని బ్యాంక్‌ల ఉద్యోగులు అమలాపురంలోని యూనియన్ బ్యాంక్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం సాయంత్రం ధర్నా చేశారు. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే అన్ని ప్రధాన బీమా సంస్థలతోపాటు ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, ఎస్‌ఈబీఐ తదితర సంస్థలు 5 రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయని బ్యాంక్ ఉద్యోగులు గుర్తు చేశారు. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్‌ల ఉద్యోగులు తీవ్రమైన సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, అధిక లక్ష్యాలతో మానసిక, శారీరక ఒత్తిడితో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోనసీమ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణ, సెక్రటరీ బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ వై.గణేష్, సబ్ స్టాఫ్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, అమలాపురం ఆర్‌ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు, కోనసీమ జిల్లా ఎల్‌డీఎం కేశవ వర్మతోపాటు కోనసీమలోని పలు బ్యాంక్‌ల యూనియన్ల ప్రతినిధులు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు.
ఆకట్టుకున్న ఆటో కార్ట్ వాహనం
ఐ.పోలవరం: నైపుణ్య వృత్తి విద్యపై అమలాపురంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐ.పోలవరం జెడ్పీహెచ్‌ఎస్ ఒకేషనల్ జట్టు తయారు చేసిన కాలుష్య రహిత ఆటో కార్ట్ (ఈకో ఫ్రెండ్లీ గో కార్ట్) వాహనం ఆకట్టుకుంది. దాన్ని రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు నడిపారు. తయారు చేసిన విద్యార్థులు భరత్, గణేష్, రాఘవ సతీష్, ఎస్.మహేష్‌బాబుతో పాటు ఒకేషనల్ టీచర్ కె.సతీష్, టీమ్‌ను అభినందించారు. జిల్లా ఒకేషనల్ టీంలో జిల్లా బాలిక అభివృద్ధి అధికారి ఎంఏకేడీ భీమారావు, ఐ.పోలవరం జెడ్పీహెచ్‌ఎస్ ఒకేషనల్ ట్రైనర్లు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వృత్తి విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి పథకం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు.
కొబ్బరి ఆధారిత
పరిశ్రమలతో ఆర్థిక వృద్ధి
అమలాపురం రూరల్: జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. కొబ్బరి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇంక్యుబేషన్ సెంటర్ డెవలప్‌చేసే విధానం, కొబ్బరి నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి డొక్క నుంచి ఫైబర్ యార్న్ కోకో ఫిట్, జియో టెక్స్‌టైల్స్ మాక్స్ తయారీ అంశాలపై చర్చించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్థానికంగా రైతులు కేవలం కొబ్బరి కాయలను విక్రయించి మిగిలిన కోయర్ విలువ ఆధారిత ఉత్పత్తులపై ఏ విధమైన ఆసక్తి చూపక నష్టపోతున్నారన్నారు. ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, నాబార్డు సంస్థల ద్వారా కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఉప్పలగుప్తంలో ఏడు ఎకరాల స్థలాన్ని ఈ పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం జరిగిందన్నారు. పశు దాణా పథకం సత్ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో పశుసంవర్ధక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పశుదాణా పథకం వల్ల కలిగిన లబ్ధి తదితర అంశాలపై సమీక్షించారు.
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
బ్యాంకు ఉద్యోగుల ధర్నా


