పెరిగిన హత్యలు.. ఆగని చోరీలు
● రోడ్డు ప్రమాదాలూ అధికమే
● 2025లో ఎక్కువైన నేరాలు
● వార్షిక నేర సమీక్ష నివేదికను
వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది (2025) జిల్లాలో హత్య కేసులు పెరిగాయి. అలాగే చోరీ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. జిల్లా మొత్తం మీద అన్ని రకాల కేసులకు సంబంధించి పెరుగుదల ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగాయి. 2025 సంవత్సరం వార్షిక నేర సమీక్ష నివేదికలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ విషయాలను వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, జిల్లా ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజుతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక నేర సమీక్ష నివేదికలోని వివిధ నేరాల గణాంకాలను వివరించారు.
● 2025లో 112 కాల్ ద్వారా 9,096 ఫిర్యాదులు అందగా, వాటిలో 9,012 పరిష్కరించారు.
● ఈ ఏడాది సీఈఐఆర్ ద్వారా సుమారు రూ.1.10 కోట్ల విలువైన 550 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు.
● ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 2,224 ఫిర్యాదులు రాగా వాటిలో 2,120 పరిష్కారమయ్యాయి.
● జిల్లాలో 42 సైబర్ నేరాలపై కేసులు నమోదయ్యాయి. 1930 సైబర్ పెట్రోల్ ద్వారా 975 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు నష్టపోయిన రూ.1.03 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా హోల్డ్ చేశారు.
● మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసుల వివరాలు, చోరీలు, ఆస్తుల రికవరీ, నిందితుల అరెస్ట్ వంటి వాటిని ఎస్పీ వివరించారు. కోడి పందేలు, పేకాట శిబిరాలు, గంజాయి, అక్రమ మద్యం, సారా కేసుల వివరాలు తెలిపారు.
సంవత్సరం హత్యలు దొంగతనాలు రోడ్డు నమోదైన
ప్రమాదాలు కేసులు
2024 9 416 572 6,747
2025 13 439 612 8393


