ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై దృష్టి పెట్టండి
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆర్డీఓలను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు, అన్న క్యాంటీన్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రాంగం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, డీఆర్వో రాజకుమారి, ఆర్డీఓలు పి.శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల పాల్గొన్నారు.
యోగా శిక్షణపై సమీక్ష
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకూ ఉన్న రోజుల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో ఐదు రోజులపాటు యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. దీనిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, ఇతర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుంచి మహేష్‌కుమార్ పాల్గొన్నారు. నెల రోజులపాటు యోగా కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు.
సమస్యలకు పరిష్కారం చూపాలి
వచ్చిన ప్రతి సమస్యకూ పరిష్కారం చూపాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయనతోపాటు జేసీ నిషాంతి, డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ జి.మమ్మీ, ఎస్‌డీసీ కృష్ణ మూర్తిలు అర్జీదారుల నుంచి సుమారు 225 అర్జీలు స్వీకరించారు. పరిష్కారం కాని సమస్యలు ఉంటే అర్జీదారునికి ఏ కారణంతో పరిష్కరించలేదో అర్థమయ్యేలా వివరించాలన్నారు.


