సాయం లేక.. సాగలేక..!
● అన్నదాతకు కలిసిరాని కాలం
● వరి సాగు తిరోగమనం
● రబీ ధాన్యం సొమ్ము జమలో జాప్యం
● ఖరీఫ్‌ను ముంచెత్తిన ప్రకృతి
● కొబ్బరి.. నింగి నుంచి నేలకు
● ఆదుకోని అరటి
● వనామీపై ట్రంపోత్పాతం
● చేయూత లేని బాబు సర్కార్
సాక్షి, అమలాపురం: క్యాలెండర్లలో తేదీలే కాదు.. సంవత్సరాలు మారుతున్నా కర్షకుడు కష్టాల నుంచి గట్టు ఎక్కలేకపోతున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు ఈ ఏడాది మన్నే మిగిలింది. ప్రకృతి ప్రకోపానికి, చంద్రబాబు సర్కార్ ఉదాసీన వైఖరికి అన్నదాత మరోసారి చిత్తయ్యాడు. ప్రకృతి శాపం కన్నా బాబు నిర్లక్ష్యంతో పుడమి పుత్రుడు నిలువునా మునిగిపోయాడు. 2025 సంవత్సరం వరి.. కొబ్బరి.. అరటి.. కూరగాయ పంటల నుంచి చివరకు వనామీ సాగు కూడా నష్టాలను మిగిల్చింది.
వరి.. రెండు పంటలకు దెబ్బ
● జిల్లాలో ప్రధానమైన వరి ఈ ఏడాది కలసిరాలేదు. ఏడాది ఆరంభంలో రబీ పంట దిగుబడి బాగా వచ్చినా కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. కొన్న ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు జమ కాకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.
● చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నీరు వదిలినా మధ్య డెల్టాలో లొల్ల, తూర్పు డెల్టాలో చొప్పెల్ల లాకుల వద్ద నిలిపివేసింది. తరువాత వదిలినా దిగువున లాకుల వద్ద నిలిపివేయడంతో ఖరీఫ్ ఆలస్యమైంది.
● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ప్రభుత్వం సకాలంలో నీరందించకపోవడం వల్ల కేవలం 1.53 లక్షల ఎకరాల్లో మాత్రమే ఖరీఫ్ సాగవుతోంది.
● సాగు మధ్యలో రైతులకు యూరియా కొరత ఏర్పడింది. యూరియా బస్తా రూ.266.50 కాగా రైతులు అదనంగా చెల్లించి రూ.400 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. చివరకు ఖరీఫ్‌లో 30 నుంచి 35 బస్తాలు రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల సగటున 25 బస్తాల కన్నా తక్కువ వచ్చింది.
ఎగసి‘పడిన’ కొబ్బరి
కొబ్బరి ధర ఈ ఏడాది ఎగసిపడింది. మే నెల నుంచి సెప్టెంబరు నెల వరకు రికార్డు స్థాయి ధర వచ్చింది. పచ్చికొబ్బరి ధర రూ.28 వేల వరకు ఉండేది. అక్టోబరు నెలలో రూ.23 వేలకు పడిపోగా, నవంబరు 15 తరువాత రూ.13 వేలకు పడిపోయింది.
రైతులకు ధాన్యం సొమ్ము ఇవ్వాలని ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు (ఫైల్)
ధాన్యం సొమ్ము విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ట్రాక్టర్లను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్)
వనామీని ముంచిన ట్రంప్
● జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశాజనకంగా ఉన్న వనామీ సాగు ఆ తర్వాత తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మార్చిలో స్థానిక ఎగుమతిదారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించేశారు. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడంతో రొయ్యల ధరలు కౌంట్‌కు కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించడంతో ఆక్వా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే సమయంలో విద్యుత్ ఓల్టేజీ వల్ల నష్టపోతున్నామని ఆక్వా రైతులు రోడ్డున పడి ఆందోళన చేయాల్సి వచ్చింది.
చేయిచ్చిన చంద్రబాబు సర్కార్
● చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు అందిస్తామని చెప్పిన తొలి ఏడాదే ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇచ్చినా కొంతమంది రైతులకు కోత పెట్టింది.
● రబీ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినప్పటికీ మూడో నెలలో కాని సొమ్ము అందలేదు. రూ.248.65 కోట్లు అందించకపోవడంతో రైతులు అప్పులు పాలయ్యారు.
● చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా విధానాన్ని ఎత్తివేసింది. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా కేవలం 44,201 ఎకరాలు మాత్రమే బీమా పరిధిలో ఉన్నాయి. మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని పాందలేకపోయారు. బీమా పరిధిలో లేని వారిలో 80 శాతం కొలుదారులు కావడం గమనార్హం.
● కోనసీమలో అత్యంత కీలకమైన పది మేజర్ డ్రైన్లలో తూడు, గురప్రు డెక్క తొలగింపునకు అరకొరగా ఇచ్చిన నిధులు కూడా వినియోగించనందున మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు చేలు ముంపులో ఉన్నాయి.
● చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఎంపిక చేసిన ప్రాజెక్టు కమిటీ ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. రూ.రెండు కోట్లు నిధులు ఇచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు.
సాయం లేక.. సాగలేక..!
సాయం లేక.. సాగలేక..!
సాయం లేక.. సాగలేక..!
సాయం లేక.. సాగలేక..!
సాయం లేక.. సాగలేక..!


