గృహ రుణాలలో చేతివాటం!
● లబ్ధిదారుల నుంచి సొమ్ముల వసూలు
● కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదుపై
అధికారుల విచారణ
● ఉన్నతాధికారుల అండదండలతోనే
అవినీతి అంటున్న బాధితులు
అల్లవరం: స్థానిక గృహ నిర్మాణ శాఖలో పనిచేసి అమలాపురం హౌసింగ్ కార్యాలయానికి బదిలీపై వెళ్లిన ఓ అధికారి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌చార్జి హోదాలో పనిచేసిన ఆ అధికారి ఆ హోదా దక్కిందే తడవుగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సదరు అధికారికి కేటాయించిన గ్రామాల్లో లబ్ధిదారులు వద్దకు వెళ్లి మీకు గృహ రుణం మంజూరు చేస్తామని రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అల్లవరానికి చెందిన బొలిశెట్టి నాగమణికి రుణం మంజూరు చేసి ఆమె వద్ద సొమ్ములు వసూలు చేసినట్టు ఆమె కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో హౌసింగ్ పీడీ నరసింహారావు, స్థానిక సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమక్షంలో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించారు. కాగా ఇదొక్కటే కాకుండా ఆయన పర్యవేక్షిస్తున్న ఎనిమిది గ్రామాల్లోనూ ఇలా చాలామంది బాధితులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లవరానికి చెందిన మరో మహిళ, రెబ్బనపల్లికి చెందిన ఇంకొక వ్యక్తి నుంచి కూడా సొమ్ములు తీసుకున్నట్టు తెలిసింది. గోడిలో బొంతు సత్యనారాయణకు గృహ రుణం మంజూరు చేసి వారి ఆధార్ కార్డు తప్పుగా బొంతు సూర్యనారాయణకు సీడింగ్ చేశారు. దీంతో సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన రూ.లక్ష నగదు సూర్యనారాయణ అకౌంట్‌కు జమ అయింది. అయితే సూర్యనారాయణ వద్దకు వెళ్లి సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన హౌసింగ్ డబ్బులు మీ అకౌంట్ పడ్డాయని ఆయకు చెప్పి సొమ్ములు కుడా కాజేశాడని సమాచారం. ఇలా ఒకటి కాదు రెండు అనేక మంది నుంచి గృహ రుణాల పేరిట డబ్బులు వసూలు చేసినట్టు వెలుగు చూసింది.
కాగా.. సదరు అవినీతి ఆరోపణలపై విచారణ జరిగి నెల రోజులు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో అతడు మళ్లీ పైరవీలు మొదలుపెట్టినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. తాను ఎవరి నుంచి అయితే డబ్బులు వసూలు చేశాడో వారి వద్దకు వెళ్లి వారికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్టుగా లెటర్లు తీసుకుంటున్నాడు. ఈ లెటర్లు హౌసింగ్ ఉన్నతాధికారులకు సమర్పించి తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల అండదండలు ఉండడం వల్లే అతడు ఈ అవినీతికి పాల్పడుతున్నాడని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
ఫిర్యాదులు నిజమే
అల్లవరం గృహ నిర్మాణశాఖలో విధులు నిర్వహించిన ఉద్యోగిపై ఫిర్యాదులు రావడం నిజమే. తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి తుది నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపాము. ఐదు నెలల కిత్రం అతడిని కార్యాలయానికి పిలిచి ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్చరించాం.
– నరసింహారావు, పీడీ,
గృహ నిర్మాణ శాఖ, అమలాపురం.


