క్రీడలతో జాతీయ గుర్తింపు
రావులపాలెం: క్రీడల్లో రాణించడంతో క్రీడాకారులు జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో దండు సాయి ఆకాష్ వర్మ జ్ఞాపకార్థం రెండు రోజులుగా నిర్వహిస్తున్న పదో రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ సీనియర్స్ మెన్, ఉమెన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌లతో కలసి జగ్గిరెడ్డి ట్రోఫీలు అందజేశారు. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్‌బాల్‌లో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవసాత్తు అకాల మరణానికి గురైన దండు సాయి ఆకాష్ వర్మ తల్లిదండ్రులు దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, సుజాత దంపతులు ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం విజేలకు శుభాకాంక్షలు తెలిపారు.
13 జిల్లాల నుంచి 26 జట్లు పోటీ..
పదమూడు జిల్లాల నుంచి మెన్, వుమెన్ కేటగిరీల్లో వచ్చిన 26 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలవగా రన్నర్‌గా విశాఖపట్నం, తృతీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి.
అలాగే మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్‌గా విశాఖపట్నం, తృతీయ స్థానం తూర్పుగోదావరి, నాలుగో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచినట్టు నెట్‌బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచ్‌లు బొక్కా కరుణాకరం, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు ముత్యాల వీరభద్రరావు, ముదునూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీను, నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెదిరేశ్వరంలో ముగిసిన
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు
విజేతలకు బహుమతి ప్రదానం చేసిన
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
పురుషుల విభాగంలో తూర్పుగోదావరి..
మహిళా విభాగంలో
కృష్ణా జిల్లా విజేతలు
క్రీడలతో జాతీయ గుర్తింపు


