ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న 76 మంది వికాస్ కార్మికుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు వెల్లడించారు. మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న వారిని తొలగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం ఏదైనా సంస్థలో 100 మందికి పైగా సిబ్బందిని తొలగించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలని ఆయన అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. మున్సిపాలిటీలో ఏటా 15 శాతం నుంచి 30 శాతం వరకూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని, కానీ ఆ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆయన అన్నారు. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక నిత్యం వేలాది మంది వివిధ పనులపై వస్తున్నారని, ఈ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన కార్మికులు చాలా మంది అవసరమవుతారని ఆయన అన్నార. పట్టణానికి వచ్చే ప్రజలకు కనీసం మూత్ర విసర్జన శాలలను ఎక్కువగా నిర్మించే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ కుడుపూడి ఆందోళన వ్యక్తం చేశారు.
రాకపోకలకు రేవులు సిద్ధం
అయినవిల్లి: ఇటీవలి వరదల సమయంలో ముక్తేశ్వరం–కోటిపల్లి రేవు మూతపడింది. ఈ లోపులో రేవు పాట కూడా ముగిసింది. దీంతో రేవు నిర్వాహకులు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వరదలకు కొట్టుకుపోయిన ముక్తేశరం రేవు వైపు, కోటిపల్లిరేవుల తాత్కాలిక రహదారిని వారం రోజుల పాటు శ్రమించి మళ్లీ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రయాణాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొబ్బరి ధరలు తగ్గితే నాఫెడ్ కేంద్రాలు సిద్ధం చేయాలి
అంబాజీపేట: కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఏపీ నాఫెడ్ బ్రాంచ్ మేనేజర్ టీఎన్ శర్మ అన్నారు. అంబాజీపేటలో జరిగిన ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు వీడ్కోలు సభలో ఆదివారం పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం కొబ్బరికి బహిరంగ మార్కెట్‌లో ధరలు బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో కొబ్బరి దిగుబడులు గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గుతున్నాయని ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడుతుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాల్ కోప్రాకు రూ.12,500, మిల్లింగ్ కోప్రాకు రూ.12,027 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ ధరలు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయన్నారు. బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు ఇంతకన్నా తగ్గిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకుని సంసిద్ధంగా ఉండాలన్నారు.
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
అమలాపురం టౌన్: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు రౌడీ షీటర్లను ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక శక్తులకు, రౌడీయిజం, గుండాయిజాలకు తావు లేకుండా చేస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్‌ల ద్వారా రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లు పదే పదే నేరాలకు పాల్పడితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం
ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం
ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం


