ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌? | - | Sakshi
Sakshi News home page

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

May 10 2025 12:29 AM | Updated on May 10 2025 12:29 AM

ఎన్నే

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

నమ్మండి ఇది రైల్వే ప్లాట్‌ ఫామ్‌!

తుప్పలు... ముళ్ల పొదలు మొలిచిన ఇది రైల్వే ట్రాక్‌, రైల్వే ప్లాట్‌ ఫామ్‌ అంటే నమ్మడం కష్టమే అయినా ఇది నిజం. కాకినాడ – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పరిధిలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు గతంలో నిర్మించిన రైల్వే ట్రాక్‌ పరిస్థితి ఇది. ట్రాక్‌ మీద, ప్ల్లాట్‌ ఫామ్‌ మీద పిచ్చి మొక్కలు మొలిచాయి. రామచంద్రపురంలో ఉన్న రైల్వే స్టేషన్‌ ధ్వంసమైంది. గతంలో ఇక్కడ నుంచి రైలు మీద కాకినాడకు, కోటిపల్లికి ప్రయాణికులు వెళ్లేవారు. రూ.కోట్ల విలువైన బియ్యం ఎగుమతి జరిగేది. ఈ స్టేషన్‌లో రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ కూడా ఉండేది. ఇప్పుడు రైల్వే రాకపోకలు లేక స్టేషన్‌ ఇలా శిథిలావస్థకు చేరింది.

సాక్షి, అమలాపురం: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కాకినాడ– నర్సాపురం రైల్వేలైన్‌. దీని నిర్మాణానికి 2004లో పునాది పడింది. 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పొడవు 102.507 కిలోమీటర్లు కాగా, కోటిపల్లి వరకు 45.30 వరకు పూర్తయ్యింది. బ్రిటిష్‌ కాలంలో 1928 నుంచి 1940 వరకు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్‌ ఉండేది. తరువాత నిలిచిపోగా 2004లో తిరిగి మొదలైంది. తొలుత చైన్నె నుంచి కాకినాడ మధ్య తిరిగే సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ – కోటిపల్లి మధ్య ప్యాసింజర్‌గా తిప్పేవారు. ఇది భారీ నష్టాలు కలుగజేస్తోందని చెప్పి తరువాత రైలు బస్సును ప్రవేశపెట్టారు. ఇది చాలాకాలం సేవలందించింది. ఇది కూడా నష్టదాయకమని దీనిని కూడా నిలిపివేశారు. ఆరు సంవత్సరాలుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కోట్ల రూపాయల లాభా లు తెచ్చిపెట్టిన బియ్యం ఎగుమతులను కూడా నిలిపివేయడం గమనార్హం. కోటిపల్లి నుంచి వ్యాగన్ల ద్వారా ఇసుక కూడా ఎగుమతి అయ్యేది. గతంలో రామచంద్రపురం స్టేషన్‌ నుంచి బియ్యం ఎగుమతులు జోరుగా సాగేవి. నెలకు రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇతర ప్రాంతాల ఎగుమతిదారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇక్కడకు రైల్వే అధికారులు గూడ్స్‌ రైలు పంపలేదనే విమర్శలున్నాయి.

ట్రాక్‌ మీద తుప్పలు... శిథిలమైన స్టేషన్‌లు

కాకినాడ– కోటిపల్లి మధ్య ఆరేళ్లుగా రైలు రాకపోకలు నిలిచిపోవడంతో రైల్వేట్రాక్‌, స్టేషన్‌లు ధ్వంసమవుతున్నాయి. రైల్వే ట్రాక్‌పై పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ట్రాక్‌ మీద వేసిన రాళ్లు చెల్లాచెదురయ్యాయి. రోడ్డు క్రాస్‌ చేసే చోట ఏర్పాటు చేసిన గేట్లు ఊడిపోయాయి. చిన్న చిన్న ఇనుప, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. స్టేషన్‌లు సైతం ధ్వంసమయ్యాయి. గుమ్మాలు, ఇతర వస్తువులు తరలించుకుపోయారు. భవనాల కిటికీలు కూడా ఊడిపోయాయి. స్టేషన్‌, ప్లాట్‌ ఫామ్‌ల మీద కూడా పిచ్చి మొక్కలు మొలిచాయి. ఈ రైల్వే లైన్‌లో అతి పెద్ద స్టేషన్‌ అయిన రామచంద్రపురం పరిస్థితి మరీ దారుణం. బహిరంగ మరుగుదొడ్లుగా మారిపోయింది. జిల్లా పరిధిలోకి వచ్చే కోటిపల్లి, దంగేరు, ద్రాక్షారామ, రామచంద్రపురం వంటి స్టేషన్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.

కాకినాడ– కోటిపల్లి రైల్వేలైన్‌ విద్యుద్దీకరణకు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదు. మొత్తం రూ.90 కోట్లు అయ్యే ఈ పనులకు 2023–24లో రూ.9 కోట్లు, 2024–25లో రూ.21 కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్లు కేటాయించారు. కాని పనులు మొదలు కాలేదు. పాత రైల్వేలైన్‌ మరమ్మతులకు రూ.పది కోట్లు కేటాయించినా పనులు చేయడం లేదని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. కనీసం ఉన్న రైల్వేలైన్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని కోరుతున్నారు.

కాకినాడ – కోటిపల్లి మధ్య తిరిగిన రైలు బస్సు

నిరుపయోగంగా మారిన కోటిపల్లి రైల్వేలైన్‌

కాకినాడ– కోటిపల్లి లైన్‌ను పట్టించుకోరా?

రైల్వే ట్రాక్‌ మీదనే పిచ్చిమొక్కలు

ధ్వంసమైన రైల్వే స్టేషన్‌లు

గతంలో 45.30 కిమీల పొడవునా

ట్రాక్‌ నిర్మాణం

విద్యుద్దీకరణకు రూ.90 కోట్లు

రెండు విడతలుగా రూ.30 కోట్ల కేటాయింపు

పట్టాలెక్కని పనులు

తొలి దశలో కాకినాడ నుంచి

కోటిపల్లి ప్యాసింజర్‌

తరువాత రైల్‌బస్సు రాకపోకలు

గూడ్స్‌ నిర్వహణతో ఆదాయం

ఆరు సంవత్సరాలుగా రాకపోకలు పూర్తిగా నిలిపివేత

చిట్టడవిలా కోటిపల్లి రైల్వే స్టేషన్‌

అడవుల్లో రైల్వే స్టేషన్‌లను చూడడం కోనసీమ జిల్లా వాసులకు అరుదు. కాని కోటిపల్లి రైల్వే స్టేషన్‌, దాని పరిసరాలను చూస్తే అడవిలోని రైల్వే స్టేషన్‌ చూసినట్టు ఉంటోంది. ఒకప్పుడు కొబ్బరి, క్రోటన్‌ మొక్కలు.. స్టేషన్‌ను ఆనుకుని పచ్చని వరిచేలతో అందంగా ఉండే ఈ స్టేషన్‌ చుట్టూ ఏపుగా పెరిగిన వివిధ రకాల పిచ్చి మొక్కలతో ఇప్పుడు చిట్టడవిని తలపిస్తోంది.

ఇది రైళ్లు తిరగని రైల్వే ట్రాక్‌

తుప్పలతో మూసుకుపోయిన ఇది రైళ్లు తిరగని రైల్వే ట్రాక్‌. కాకినాడ– కోటిపల్లి రైల్వే ట్రాక్‌ దుస్థితి ఇలా మారింది. ఇది రామచంద్రపురం– ద్రాక్షారామ రైల్వే స్టేషన్‌ల మధ్య చిన్న తాళ్లపొలం వద్ద రైల్వేగేట్‌ వద్ద పరిస్థితి. గతంలో రైళ్లు.. తరువాత రైలు బస్సు తిరిగిన ఈ ట్రాక్‌ మీద గత కొన్నేళ్లుగా రైళ్లు తిరగడం లేదు. దీనితో ఇలా తుప్పలతో నిండిపోయింది.

అమలాపురం వరకూ పూర్తి చేయాలి

కాకినాడ – నర్సాపురం రైల్వేలైన్‌లో గౌతమీ వంతెనకు సంబంధించి పియర్ల నిర్మాణం పూర్తయ్యింది. గెడ్డర్లకు టెండర్లు పూర్తి కావడంతో పనులు జరుగుతున్నాయి. వంతెన దాటిన తరువాత పది కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణం పూర్తయితే అమలాపురం వరకు రైలు వచ్చే అవకాశముంది. దీనివల్ల రైల్వేకు ప్రయాణికుల ఆదాయం, గూడ్స్‌ ఆదాయం కూడా పెరుగుతుంది.

– బండారు రామ్మోహనరావు,కోనసీమ జేఏసీ కన్వీనర్‌, అమలాపురం

గూడ్స్‌ రైళ్ల ద్వారా ఆదాయం

ప్రయాణికుల కన్నా గూడ్స్‌ ద్వారా రైల్వేకు ఆదాయం వస్తోంది. ఈ విషయం రైల్వే గుర్తుంచుకోవాల్సి ఉంది. రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి కేరళకు బొండాల రకంతోపాటు పలు రకాల ధాన్యం దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. గూడ్స్‌ రాకపోకలు మొదలైతే రైల్వే ట్రాక్‌కు ఇప్పుడున్న దుస్థితి ఉండదు.

– కొవ్వూరి త్రినాఽథ్‌రెడ్డి, రామచంద్రపురం రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?1
1/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?2
2/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?3
3/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?4
4/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?5
5/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?6
6/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?7
7/7

ఎన్నేళ్లీ రెడ్‌ సిగ్నల్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement