
బిక్కవోలు మండలం కొంకుదురులో టీమ్ ఇండియాకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్న విద్యార్థులు
ఫ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని క్రికెట్ అభిమానులే కాదు.. మిగిలిన క్రీడలను ఇష్టపడే వారు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుగానే పనులు చక్కబెట్టుకుంటున్నారు.
ఫ ఫైనల్స్ చూసేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ స్టేడియంలో క్రీడాకారులు శనివారం ఉదయం భారత్ జట్టు కప్పు కొట్టాలని కోరుతూ ‘ఆల్ ద బెస్ట్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఫ రాజమహేంద్రవరంతో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాల్లో క్రీడాభిమానులు హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. స్నేహితులతో కలిసి మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఫ క్రికెట్ ఫైనల్స్ ప్రదర్శనకు పలు రెస్టారెంట్లు, బార్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలోని ఒక కల్యాణ మండపంలో భారీ తెర ఏర్పాటు చేస్తున్నారు. ఫైనల్స్ చూసేందుకు అందరూ ఆహ్వానితులేనంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.
ఫ పనిలో పనిగా జాతీయ జెండాలకు గిరాకీ వచ్చింది. వీటితో పాటు భారత క్రీడాకారులు వాడే జెర్సీ, టీ షర్ట్‌ల అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి.
ఫ వరల్డ్ కప్ ఫైనల్స్ ఫీవర్ సోషల్ మీడియాను కూడా కుదిపేస్తోంది. వాట్సాప్ చాటింగ్‌లతో పాటు డీపీలుగా, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లలో భారత విజయాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో క్రికెట్ పోస్టింగ్‌లే ట్రెండింగ్‌గా మారాయి.
ఫ ఫైనల్స్‌పై బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే రెండు జట్లూ సమ ఉజ్జీలు కావడంతో బెట్టింగ్ కూడా రూపాయికి రూపాయి అన్నట్టుగా జరుగుతోంది. జాతీయాభిమానం, ట్రాక్ రికార్డు పరిశీలించిన ఎక్కువ మంది భారత్ జట్టుపై బెట్టింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.
ఫ ఫైనల్స్‌లో భారత జట్టు గెలిస్తే ఆదివారం రాత్రి మరోసారి దీపావళి పండగే. సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.
హోరాహోరీ పోరు
ఆస్ట్రేలియా కూడా బాగా ఆడుతోంది. రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఫైనల్స్ హోరాహోరీగా జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. భారత్ జట్టు గెలవాలని కోరుకుంటున్నాను.
– బొంతు రమేష్, క్రికెట్ క్రీడాకారుడు, అంబాజీపేట
టీమ్ ఇండియాకు బెస్ట్ ఆఫ్ లక్
ఫైనల్స్‌లో భారత జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టీమ్ ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుంది. రోహిత్, కొహ్లీలు సెంచరీలు చేస్తారని మా నమ్మకం.
– ఖాజా మైమున్నీసా,
ఖాజా రహమున్నీసా, క్రికెటర్లు,
కొంతమూరు


Comments
Please login to add a commentAdd a comment