లంక భూములకు గోదావరి కోత
కొత్తపేట: జిల్లాలో గోదావరి ప్రవాహానికి కోతకు గురవుతున్న లంక భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్రేయపురం మండలం రాజవరం సమీప లంక ప్రాంతంలోని విలువైన భూములు నదీ కోతకు గురవుతున్న విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై స్పందించిన జగ్గిరెడ్డి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఏడాది గోదావరి వరదలు, నదీ ప్రవాహానికి పంట భూములు కోతకు గురైపోతున్నాయని రైతులు వివరించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాణిజ్య పంటలు పండే ఎంతో విలువైన భూమి కోతకు గురై గోదావరిలో కలిసిపోతోందన్నారు. వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా వానపల్లి, కపిలేశ్వరపురం మండలాల పరిధిలోని లంక భూములు కూడా కోత బారిన పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, లంక భూముల నదీ కోతను అరికట్టి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (విపత్తు నిర్వహణ) కింద ప్రతిపాదించి, వెంటనే ప్రత్యేక బృందంతో పరిశీలన జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.
నదిలో కలిసిపోతున్న విలువైన భూములు
చంద్రబాబు ప్రభుత్వం
తక్షణ చర్యలు చేపట్టాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
కోతకు గురైన ప్రాంతాల పరిశీలన


