స్టేట్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో కోనసీమ సత్తా
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశాయి. వాటిలో ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని, దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శిని అనే రెండు అంశాలుగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అమలాపురం మండలం సమనస జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘మెషిన్ ఫర్ అగ్రికల్చరల్’, రావులపాలెం మండలం ఊబలంక జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.
● వ్యక్తిగత విభాగం నుంచి రామచంద్రపురంలోని లాల్ బహుదూర్‌శాస్త్రి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రూపొందించిన ‘సస్టైనబుల్ అగ్రికల్చర్’ ప్రాజెక్టు, గ్రూపు విభాగం నుంచి అమలాపురం పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘ఫుట్ ప్రెజర్ పవర్ జనరేషన్’ ప్రాజెక్టు, రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ ప్రాజెక్టు సదరన్ ఇండియా సైన్స్ ఫేర్‌కు ఎంపికయ్యాయి. రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు రెండు విభాగాల్లో ఎంపిక కావడం గమనార్హం.
● సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 జనవరి 18న హైదరాబాద్‌లో జరగనుండగా, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జరిగే ప్రదేశం, తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జిల్లా నుంచి ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ఆ విద్యార్థులను, గైడ్ టీచర్లను అభినందించారు.


