
వాలమూరు వాగులోకి మొసలిని వదులుతున్న అటవీ సిబ్బంది
మండపేట: రైతుల కష్టం దళారుల పాలవకుండా, వారికి అండగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు తెలిపారు. మండపేట సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. తేమశాతం నిర్ధారణ సామగ్రి, గోనెసంచులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 1.53 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేశారన్నారు. వాతావరణం అనుకూలించడంతో పంట ఆశాజనకంగా పండిందన్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారని తెలిపారు. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు, రామచంద్రపురం మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయని, శుక్రవారం నాటికి 5,200 ఎకరాల్లో పూర్తయ్యాయని చెప్పారు. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 374 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 2.73 లక్షల గోనెసంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, మద్దతు ధర పొందాలని రైతులకు బోసుబాబు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కె.నాగేశ్వరరావు, ఏఓ కె.ఏసుబాబు, సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర్, సీఈఓ సీహెచ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
పట్టుబడిన మొసలి..
వాలమూరు వాగులోకి..
అమలాపురం రూరల్: చల్లపల్లి ప్రధాన పంట కాలువలో పట్టుబడిన మొసలిని అటవీ శాఖ అధికారులు వాలమూరు వాగులో సురక్షితంగా విడిచిపెట్టారు. జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యాన విశాఖపట్నానికి చెందిన రెస్క్యూ టీం సభ్యులు, మత్స్యకారులు గురువారం రాత్రి ఈ మొసలిని బంధించిన విషయం తెలిసిందే. దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, తాళ్లతో బంధించి, వ్యాన్‌లో రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలానికి తరలించి, వాలమూరు వాగులో శుక్రవారం విడిచిపెట్టారు. జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జూ పార్కు వైద్యుడు ఫణీంద్ర, ఫారెస్ట్ బీటు ఆఫీసర్లు వెంకట రమణ, లోవ ప్రసాద్, బేస్ క్యాంపు ఇన్‌చార్జి రవి పాల్గొన్నారు. మొసలి పీడ వదలడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న బోసుబాబు