బాల మేధస్సుకు పదును
● కలెక్టర్ మహేష్‌కుమార్
● ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
అమలాపురంటౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెల్లి వెరిసేలా బాల మేధస్సుకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని, అప్పుడే భావి శాస్త్రవేత్తలు పుట్టుకు వస్తారని కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ రావిరాల పేర్కొన్నారు. అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా విద్యా శాఖ, జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశీలనాశక్తిని, సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌ను పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ మాట్లాడారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల నుంచి 174 ప్రాజెక్టులు సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు వచ్చాయన్నారు. వీటి నుంచి 11 ప్రాజెక్టులను ఎంపిక చేసి, మంగళ, బుధవారాల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సుకు పంపిస్తున్నట్లు తెలిపారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎన్‌ఎసీసీ, జాతీయ సైన్స్ కాంగ్రెస్ పతాకాలను అతిథులు ఆవిష్కరించారు. సర్ సీవీ రామన్, గణిత మేధావి రామానుజన్ చిత్ర పటాలను ఆవిష్కరించారు. ఏడు థీమ్స్‌తో కూడిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉప విద్యాశాఖాధికారులు జి.సూర్యప్రకాశరావు, పి.రామలక్ష్మణమూర్తి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రాజెక్టులు
రాయవరం: జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.
పాఠశాలలపై సోలార్ ఎనర్జీ
పాఠశాలలపై సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అధిక మొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునంటూ రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు నిరూపించారు. 7వ తరగతికి చెందిన కె.ఈశ్వర్‌సంజీవ్, 9వ తరగతికి చెందిన సీహెచ్.పవన్‌సాయి ఈ ప్రాజెక్టును రూపొందించారు. గైడ్ టీచర్ సీహెచ్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఫుట్ ప్రెషర్ ఎలక్ట్రిసిటీ
నడుస్తున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫుట్‌పాత్ మీద నడుస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఎనర్జీ జనరేట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీనే మనం విద్యుత్ అవసరాలకు వాడుకోవచ్చునని అమలాపురంలోని వెత్సావారి అగ్రహారం ఎంజీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరూపించారు. పాఠశాలకు చెందిన ఎన్.సత్యప్రవీణ్, పి.సిద్దార్ధలు గైడ్ టీచర్ పీవీఎల్‌ఎన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ సిస్టమ్
తక్కువ ఖర్చుతో అధికంగా ఉత్పత్తిని సాధించడం ఎలాగన్నది ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ సిస్టమ్ ద్వారా నిరూపించారు. రామచంద్రపురం అనిశెట్టివారి సావరంలోని ఎస్‌ఎల్‌బీ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.నాగదేవి, సీహెచ్.సుచిత్ర గైడ్ టీచర్ బి.విజయశ్రీ నేతృత్వంలో ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తక్కువ విస్తీర్ణంలో మిక్స్‌డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్, హైడ్రోఫోనిక్ వెర్టికల్ క్రాపింగ్, యానిమల్ హజ్బెండరీ, ఆక్వాకల్చర్‌ను అభివృద్ధి చేసే విధానాన్ని తెలియపర్చారు. మల్టీ క్రాపింగ్ ద్వారా రైతులు నష్టపోకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు.
బాల మేధస్సుకు పదును


