వైఎస్సార్ టీయూసీ బలోపేతానికి చర్యలు
అమలాపురం టౌన్: వైఎస్సార్ టీయూసీ జిల్లా యూనియన్‌ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ యూనియన్ జోనల్ అధ్యక్షుడు భూపతి అజయ్‌కుమార్ అన్నారు. అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో సోమవారం జరిగిన జిల్లా యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సమావేశానికి జిల్లా యూనియన్ అధ్యక్షుడు యల్లమిల్లి వెంకటేశ్వర అధ్యక్షత వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి యూనియన్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అజయ్‌కుమార్ వెల్లడించారు. పార్టీ కోసం శ్రమించేలా పటిష్టమైన కార్మిక విభాగాన్ని, నాయకత్వాన్ని తయారు చేస్తున్నామన్నారు. పార్టీ పురోభివృద్ధికి టీయూసీ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి, జిలా కార్యదర్శి శెట్టి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు ఇళ్ల సత్య గోపాలకృష్ణ, కాకిలేటి శ్రీనివాస్‌తోపాటు జిల్లాలోని నియోజకవర్గాల యూనియన్ అధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్, పితాని నరేష్, ములపర్తి సత్యనారాయణ, బొంతు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పెన్షనర్స్ విభాగం కార్యదర్శి టపా పుల్లేశ్వరరావులు ప్రసంగించి కార్మిక ఉద్యమ చరిత్ర, నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.
250 అర్జీల స్వీకరణ
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సుమారు 250 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి, డీఆర్‌ఓ కే. మాధవి సమగ్ర శిక్ష ఏపీసీ జి. మమ్మీ, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 29 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికకు 29 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువ భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలే ఉండడంతో ఆ ఫిర్యాదుదారులతో ఎస్పీ మీనా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
రాజ్యలాభం కన్నా ధర్మలాభం గొప్పది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాజ్యలాభం కన్నా ధర్మమార్గం గొప్పది. ధర్మానికి తపస్సే మార్గమని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతాడు’ అని సామవేదం షణ్ముఖశర్మ తెలిపారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారతం ప్రవచనాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ‘‘తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాండవుల వద్దకు కృష్ణుడు వచ్చి ధర్మజ, భీములకు నమస్కరిస్తాడు. వారిద్దరూ వయసులో కృష్ణునికన్నా పెద్దలు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. కృష్ణునికి నకుల సహదేవులు నమస్కరించారు. ధర్మరాజుతో కృష్ణుడు మాట్లాడుతూ, వనవాస సమయంలో నీలో ఎటువంటి సుగుణాలున్నాయో, రాజుగా ఉన్న సమయంలో కూడా అవే ఉన్నాయి. నీవు కర్మలను కామ్య దృష్టితో చేయవు’’ అని అంటాడని వివరించారు. సాధకుని దృష్టి ధర్మరాజుపై, లక్ష్యం కృష్ణునిపై ఉండాలని అన్నారు. ‘‘అనంతరం వారి వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన తపస్సా్‌ాధ్యయ సంపన్నుడు. జరామరణాలు లేనివాడు. వేల సంవత్సరాల వయసున్నా, పాతికేళ్ల యువకునిలా ఉండేవాడని వ్యాసుడు వర్ణించాడు. ప్రళయ కాలంలో సృష్టి అంతా జలమయమైన సమయంలో కూడా ఆయన అదే శరీరంతో ఉన్నారు’’ అని చెప్పారు. శకుని ప్రోద్బలంతో కౌరవులు ఘోష యాత్రకు ప్రయాణమవుతారన్నారు.
గ్రంథావిష్కరణ
విశ్రాంత ఓఎన్‌జీసీ అధికారి, ప్రముఖ సాహితీవేత్త కవితా ప్రసాద్ రచించిన సౌందర్యలహరి పద్య సంపుటిని ప్రవచనానంతరం షణ్ముఖశర్మ ఆవిష్కరించారు. శంకరభగవత్పాదులు అందించిన సౌందర్యలహరి శ్లోకాలను మధ్యాక్కర ఛందస్సులో కవితా ప్రసాద్ అనువదించిన తీరు అభినందనీయమని అన్నారు. ఆదిశంకరుల శ్లోకాలకు రచయిత ప్రామాణికమైన అనువాదాన్ని అందించారని చెప్పారు.


