హక్కులు, బాధ్యతలపై అవగాహన
సమనసలో వినియోగదారుల సదస్సు
అమలాపురం రూరల్: ప్రతి వినియోగదారుడికి హక్కులు బాధ్యతలపై అవగాహన పెంపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి పిలుపు నిచ్చారు. సోమవారం సమనసలో ఒక స్కూల్‌లో నిర్వహించిన వినియోగదారుల అవగాహన సదస్సును జిల్లాస్థాయి అధికారులు, పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందని అదే విధంగా సరైన సమాచారం తెలుసుకుని, బిల్లులు తీసుకుని, మోసాలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండటం వినియోగదారుని బాధ్యత అన్నారు. డీఆర్‌ఓ కే మాధవి మాట్లాడుతూ డిజిటల్ ఫిర్యాదుల పరిష్కారం వంటి ఆధునిక సాంకే తికతలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ ప్రసంగిస్తూ వినియోగదారులు తూకాలు, కొలతల్లో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తూని కలు కొలతలు శాఖ నియంత్రణ అధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు పరిశీలించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య మాట్లాడుతూ కొనుగోలు చేసిన పదార్థాలు తాజాగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు రహదారి భద్రత పట్ల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని చేసి ఐదుగురు ఉపాధ్యాయులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. 24 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5,000 రూ.3,000, రూ.2,000 నగదు, ప్రశంసా పత్రాలు జేసీ చేతుల మీదుగా బహుకరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు పాల్గొన్నారు.


