అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేత హత్య | YSRCP Leader Brutally Murdered In Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేత హత్య

Mar 29 2022 9:05 AM | Updated on Mar 29 2022 4:52 PM

YSRCP Leader Brutally Murdered In Anantapur District - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత బోయ శ్రీధర్‌

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బోయ శ్రీధర్‌(40)ను దుండగులు హతమార్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ పోస్టుమార్టంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. షెక్షానుపల్లి సర్పంచ్‌ బోయ లింగన్న కుమారుడైన శ్రీధర్‌ 2014లో తన భార్య మల్లికను ఎంపీటీసీగా గెలిపించుకున్నాడు.

ఆ సమయంలో కక్ష పెంచుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు 2015లో జరిగిన తన సోదరుడి హత్య కేసులో శ్రీధర్‌ను ఇరికించాడు. గ్రామంలో గొడవలు చెలరేగకుండా ఉండేందుకు పెద్దల సూచన మేరకు శ్రీధర్‌ కుటుంబంతో సహా శెట్టూరు వెళ్లిపోయాడు. అక్కడే ఓ ఎరువుల దుకాణం పెట్టుకొని జీవనం సాగించేవాడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో షెక్షానుపల్లి సర్పంచ్‌గా శ్రీధర్‌ తండ్రి లింగన్న గెలుపొందాడు. 

అప్పటినుంచి శ్రీధర్‌పై టీడీపీ నేత మనోహర్‌నాయుడు పగతో రగిలిపోయేవాడు. ఆదివారం అనంతపురంలో జరిగిన ఎరువుల కంపెనీ ప్రతినిధుల సమావేశంలో శ్రీధర్‌ పాల్గొన్నాడు. అది ముగిసిన అనంతరం.. ఆదివారం రాత్రి బైక్‌పై ఒంటరిగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఇదిలాఉండగా, కాలువపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కళ్యాణదుర్గం పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని శ్రీధర్‌గా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. బలమైన ఆయుధాలతో శ్రీధర్‌పై దాడిచేసి హతమార్చినట్లుగా సోమవారం పోస్టుమార్టంలో బయటపడింది. తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ నేత మనోహర్‌నాయుడు తన అనుచరులతో కలిసి శ్రీధర్‌ను కారులో వెంబడించి.. వేట కొడవళ్లతో దాడికి దిగి దారుణంగా చంపేశాడని లింగన్న కన్నీటిపర్యంతమయ్యాడు. ఎవరికీ అనుమానం రాకూడదనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తెలిపాడు.  

శ్రీధర్‌ హత్య దారుణం: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 
కక్షలకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్న శ్రీధర్‌ను వెంటాడి హతమార్చడం దారుణమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో శ్రీధర్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. ఓదార్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement