
విజయనగరం క్రైమ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయత్‌పూర్‌కు చెందిన చింపి షైనీ (20)స్థానిక తోటపాలెంలో ఆదివారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. చింపి షైనీ విశాఖలోని ప్రైవేట్‌హోటల్‌లో పనిచేస్తోంది. ఆమె మరో ఇద్దరు యువతులతో కలిసి విజయనగరంలోని తోటపాలెం షిర్డీసాయినాథ్ కాలనీలో నెలరోజుల క్రితం అద్దెకు దిగింది. వారు ముగ్గురూ శనివారం రాత్రి పార్టీ చేసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్రలోకి జారుకున్నారు.
ఆదివారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో ఇంటి యజమాని చూసేసరికి షైనీ బెడ్‌రూంలో కిటికికీ చున్నీ బిగించుకుని ఉరివేసుకుంది. అయితే ఆమె అనాథ. ఆత్మహత్యకు ప్రేమవ్యవహారం కారణమై ఉంటుందా? లేక ఏదైనా వ్యవహారంలో మనస్తాపం చెందిందా? ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటియజమాని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై విజయ్ సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేశారు.