Tadepalli Crime News: Woman Committed Suicide For Brother In Law Harassment | కోరిక తీర్చాలంటూ బావ వేధింపులు.. తట్టుకోలేక - Sakshi
Sakshi News home page

కోరిక తీర్చాలంటూ బావ వేధింపులు.. తట్టుకోలేక

Feb 2 2021 8:12 AM | Updated on Feb 2 2021 9:53 AM

Women Suicide Attempt Over Husband Brother Harassment - Sakshi

గీతాసురేఖ

తాడేపల్లి: బావ లైంగిక వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన అన్నారావు, సత్యవతిల ఏకైక కుమార్తె గీతాసురేఖకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. భర్త శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తమ్ముడు శ్రీనివాసరావు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అన్న శివశంకర్‌ మరదలిపై కన్ను వేసి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిజేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది.  అదే రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి వచ్చాడు. తమ కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పాడు.

పిల్లల్ని సైతం బెదిరించడంతో వారు కూడా అలాగే చెప్పి భోరున విలపించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్నా చెప్పకుండా దాచారు. పిల్లలు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే బాధితురాలిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సురేఖ మృతి చెందింది. బావ శివశంకర్, మామ ఆదిశేషు, దీనికి కారణమైన మిగతా వారిపై కేసు నమోదు చేయాలని సురేఖ బంధువులు డిమాండ్‌ చేశారు. అమ్మకు ఏమైందో అర్థంకాక ఆ చిన్నారులిద్దరూ  ఆస్పత్రిలో బెడ్‌ వద్దే నిలబడి తీవ్రంగా దుఃఖించారు. చివరకు తల్లి చనిపోయిందని తెలియడంతో పిల్లలు బోరున విలపిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. నిందితుడు శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement