ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

Women Assassination Over Extra Marital Relation In Rangareddy - Sakshi

మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం

కేసు వివరాలు వెల్లడించిన షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. దాదాపు 23 రోజుల క్రితం హత్యకు గురైన మహిళ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారా అమృత(25)ను హత్య చేసిన ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మార్చి 31న అమృత హత్యకు గురికాగా నిందితుడి సమాచారంతో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ వెల్లడించిన కేసు వివరాలు.. అమృతకు పదేళ్ల క్రితం కేశంపేట మండలం అల్వాల్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. నాలుగున్నరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అమృత తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కూలీపని చేసుకునే ఈమెకు ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది.

అయితే అమృత మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న శంకర్‌ ఆమె హత్యకు పథకం వేశాడు. మార్చి 31న అమృత కనిపించకుండా పోవడంతో సోదరుడు నర్సింహ ఏప్రిల్‌ 1న కేశంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే మార్చి 31న అమృతకు మద్యం తాగించిన శంకర్‌ తన బైక్‌పై తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్పగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫోన్‌ద్వారా తన స్నేహితుడైన ఆమనగల్లు మండలం విఠాయిపల్లికి చెందిన ఇస్లావత్‌ శంకర్‌కు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అమృత మెడకు చున్నీ బిగించి చంపేశారు.

చదవండి: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...

అనంతరం గుట్ట పక్కనే ఉన్న గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. గురువారం శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి సమాచారం మేరకు మల్లప్పగుట్టవద్ద అమృత మృతదేహాన్ని వెలికితీయించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు పాల్పడిన శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు ఇస్లావత్‌ శంకర్‌ పరారీలో ఉన్నాడని ఏసీపీ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ ఉపేందర్, ఎస్‌ఐలు ధర్మేశ్, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

చదవండి: క్షణికావేశంలో భర్తను చంపిన భార్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top