ఎంపీ బంధువునని రూ.7 లక్షల స్వాహా

Woman Took Rs.7 Lakhs Her Rent Owner And Disappeared - Sakshi

మైసూరు: ఉత్తర కన్నడ జిల్లా ఎంపీ అనంతకుమార్‌ హెగడె బంధువునని చెప్పుకున్న ఒక మహిళ తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని వద్ద సుమారు రూ. 7 లక్షలు తీసుకుని అదృశ్యమైంది. ఈ సంఘటన మైసూరు కువెంపు నగరలో చోటు చేసుకుంది. నిందితురాలు రేఖా హెగడె (32). సుధీర్, మంజుళ అనే దంపతులకు చెందిన ఇంటిలో రేఖా నివాసం ఉంటుంది. 

తనకు ఎంపి అనంత్‌ కుమార్‌ హెగడె దగ్గరి బంధువని చెప్పుకుంది. రూ. 1 కోటితో ఇంటిని కొనుగోలు చేస్తున్నానని, ఇందుకోసం రూ.7 లక్షలు తక్కువ అయ్యాయి, ఇస్తే వెంటనే తిరిగి ఇస్తానని నమ్మబలికింది. దీంతో  సుధీర్‌ దంపతులు ఆమెకు ఆ డబ్బు ఇచ్చారు. మరుసటి రోజే పరారైంది. దీంతో బాధితులు కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఘరానా దొంగ అరెస్టు
బనశంకరి: విలాసవంతమైన జీవనం కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్‌ సాదిక్‌ పట్టుబడిన దొంగ. మంగళూరుకు చెందిన నిందితుడు బెంగళూరు సిటీమార్కెట్‌లో ఉన్న ఒక హోటల్‌లో క్లీనింగ్‌ పనిచేసేవాడు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడు దొంగతనాల కేసుల్లో జైలు పాలై, విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడడం గమనార్హం.

బెట్టింగ్‌ కేసులో పట్టివేత  
క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హెచ్‌ఏఎల్‌ రెండోస్టేజ్‌ వద్ద  బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిసి దాడి చేశారు. నిందితున్ని అరెస్టు చేసి రూ.9.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 

(చదవండి: స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్‌ చేసి రూ.10 లక్షల వసూలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top