మూడు రోజులు ఇంటి ఎదుటే మృతదేహం.. గల్ఫ్‌ నుంచి భర్త రాకతో.. | Woman Dies In Jagtial, Husband Cries After Came From Gulf Country | Sakshi
Sakshi News home page

మూడు రోజులు ఇంటి ఎదుటే మృతదేహం.. గల్ఫ్‌ నుంచి భర్త రాకతో..

Jan 28 2022 3:06 PM | Updated on Jan 28 2022 3:16 PM

Woman Dies In Jagtial, Husband Cries After Came From Gulf Country - Sakshi

భార్య లక్ష్మి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త రాజయ్య  

సాక్షి, జగిత్యాల: ఉపాధికోసం భర్త ఎడారిదేశాలకు వెళ్లగా.. పిల్లల బాగోగులు చూసుకుంటూ భార్య ఇంటివద్ద ఉంటోంది. కష్టసుఖాల్లో తోడునీడగా వారి జీవనం సాగిపోతుండగా.. అనారోగ్యంతో భార్య చనిపోయింది. భర్త చివరి చూపు కోసం మూడురోజులుగా మృతదేహాన్ని ఇంటిఎదుటే ఉంచగా.. గురువారం కట్టుకున్నోడు ఇల్లుచేరి భార్య మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు. చివరిచూపు చూసుకుని కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన మండలంలోని మోరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మోరపల్లి గ్రామానికి చెందిన బొల్లె రాజయ్య, లక్ష్మి(40) దంపతులు. వీరికి రాజు, రమ్య, వంశీ ముగ్గురు సంతానం. రాజయ్య కుటుంబ పోషణ కోసం గత కొద్ది సంవత్సరాలుగా సౌదీ అరేబియా వెళ్తున్నాడు.

లక్ష్మి గత ఆరునెలలుగా అనారోగ్యం పాలై ఈనెల 25న మృచెందింది. ఈ విషయాన్ని సౌదీలో ఉన్న రాజయ్యకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతను తన భార్యను చివరి చూపు చూసుకుంటానని, తాను వచ్చే వరకు అంత్యక్రియలు చేయవద్దని రోదిస్తూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మూడు రోజులుగా లక్ష్మి మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు. బొల్లె రాజయ్య గురువారం సాయంత్రం సౌదీ అరేబియా నుంచి మోరపల్లికి చేరుకున్నాడు. భార్య మృతదేహం పడి రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement