శవం ఎదుటే ఆస్తి పంచాయితీ | daughter in law death property dispute jagtial | Sakshi
Sakshi News home page

శవం ఎదుటే ఆస్తి పంచాయితీ

May 4 2026 8:09 AM | Updated on May 4 2026 8:09 AM

daughter in law death property dispute jagtial

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని వంజరివాడకు చెందిన రాములు, శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి చేశారు. కుమారుడు రాజుకు భార్య మాధురి, కొడుకు ధీరజ్‌ ఉన్నారు. మూడేళ్ల క్రితం రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ సమయంలో రాజు పేరిట ఉన్న కారు, బంగారం, ఇతరత్రా ఆభరణాలను శారదనే తీసుకుంది. మాధురిని పుట్టింటికి వెళ్లగొట్టింది. ఉన్న ఆస్తులు, డబ్బులను ఇద్దరు కూతుళ్లకు పంచి ఇచ్చింది. 

మాధురికి మాత్రం ఆస్తి ఇవ్వబోనంటూ మొండికేసింది. ఈ క్రమంలో మాధురి తన కుమారుడు ధీరజ్‌తో కలిసి కరీంనగర్‌లో సోదరుడి ఇంటి వద్ద ఉంటూ.. అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం వంజరివాడకు తెచ్చారు. అంత్యక్రియలు నిర్వహించాలని అత్త శారదను కోరినా ఒప్పుకోలేదు. అంతేకాక నయాపైసా ఇచ్చేది లేదంటూ భీష్మించుకుంది. 

ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తమ తల్లిపేరిట ఉన్న ఆస్తి తమకే చెందుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాధురి మృతదేహాన్ని ఆమె బంధువులు, కుటుంబసభ్యులు ఇంట్లోనే పూడ్చేస్తామంటూ గుంత తవ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శారద పేరిట ఉన్న ఆస్తులను ధీరజ్‌కు ఇస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement