ప్రాణాలు తీసి.. ‘నా భర్త నిద్రపోయాడు.. లేవడం లేదు’ అని నాటకం

Wife Assasinate  Her Husband In Mahabubnagar - Sakshi

సాక్షి, గోపాల్‌పేట(మహబూబ్‌నగర్‌): తాడిపర్తిలో ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే హతమార్చిన భార్య ఘటన మరవక ముందే.. తాగొచ్చి గొడవ పడుతున్నాడని తాజాగా బుద్దారం–లక్ష్మీతండాలో భర్తను కొట్టి, గొంతునులిమి చంపేసింది భార్య. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఈ తండాకు చెందిన ముడావత్‌ రమేష్‌ (36) కు భార్య శాంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అక్కడ కూలి పనిచేసి జీవనం సాగించేవాడు. కాగా, తరచూ మద్యం తాగొచ్చి గొడవ పడటంతో పాటు ఇంటి కిరాయి సరిగా చెల్లించేవాడు కాదు.

దీంతో పదిరోజుల క్రితం ఖాళీ చేసి స్వగ్రామానికి వచ్చారు. నాలుగు రోజులుగా వనపర్తి అడ్డమీదకు పనికి వెళ్లడం వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడి దూషించాడు. ఆవేశానికి లోనైన ఆమె బండిగుంజ (సనుగొయ్య) తీసుకుని తీవ్రంగా కొట్టడమేగాక గొంతు నులిమింది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వదిలేసింది. అయితే సాయంత్రం చుట్టుపక్కలవారికి ‘నా భర్త నిద్రపోయాడు.. లేవడం లేదు..’ అని నమ్మబలికింది. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మృతుడి అన్న ముడావత్‌ బాలు ఫిర్యాదు మేరకు సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు శాంతిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే చంపేసినట్టు అంగీకరించింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top