Visakhapatnam: Man Arrested for Cheating On Woman Name Of Marriage - Sakshi
Sakshi News home page

నమ్మి ఆ ఫోటోలు, వీడియోలు పంపిన యువతి.. చివరికి ఏం జరిగిందంటే?

Published Sun, Jun 26 2022 5:20 PM

Visakhapatnam: Man Arrested For Cheating On Woman Name Of Marriage - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒక యువతి ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ పంపిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగ్న ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధిస్తూ బెదిరించిన నయవంచకుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టర్‌ 10లో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు తాను బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నానని నగరానికి చెందిన ఒక యువతికి పరిచయం చేసుకున్నాడు.
చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ..

ఫోన్‌ ద్వారా రోజూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొద్ది రోజులకు ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన యువతి తన రెజ్యూమ్‌తోపాటు ఫొటోలు, సర్టిఫికెట్లను పంపించింది.

తర్వాత నగ్న ఫొటోలు పంపించాలని కనకరాజు యువతిని కోరాడు. ముందు అంగీకరించలేదు. రోజూ అడుగుతుండడంతో పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఒకసారి నగ్న ఫొటోలు, వీడియోలను వాట్సాప్‌ ద్వారా కనకరాజుకు పంపించింది. కొద్ది రోజులకు మళ్లీ ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధించడం ప్రారంభించాడు. లేనిపక్షంలో ముందు పంపించిన ఫొటోలు, వీడియోలు యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు.

దీంతో ఆమె ఈ నెల 22న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్‌ ఏడీసీపీ డి.సూర్యశ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ, బృందం విచారణ చేపట్టారు. యువతని బెదిరిస్తున్న వ్యక్తి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు(48)గా గుర్తించి అరెస్టు చేశారు. అపరిచితులను నమ్మి సోషల్‌ మీడియా ద్వారా గాని, నేరుగా గాని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు ఇచ్చి మోసపోవద్దని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలకు సూచించారు. 

Advertisement
Advertisement