ప్రాణం తీసిన పంట నష్టం

Two Farmers Suicide Due To Crop Damage By Heavy Rains In Adilabad District - Sakshi

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతుల ఆత్మహత్య

సోన్‌/ఆదిలాబాద్‌ రూరల్‌: వర్షాలు, వరదలు మిగిల్చిన పంట నష్టం ఇద్దరు రైతుల ఉసురు తీసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనల వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గంజాల్‌ గ్రామానికి చెందిన మాముళ్ల గంగాసాగర్‌(37) తన రెండెకరాల భూమితో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇందుకోసం మూడేళ్ల క్రితం రూ.3 లక్షలు అప్పుచేశాడు. గతేడాది, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ నది ఉప్పొంగడంతో పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి.

గతేడాది పంటలు నష్టపోయినా అప్పులుచేసి కౌలు డబ్బులు చెల్లించిన గంగాసాగర్, ఈ ఏడాది కూడా పంటలను వరదలు తుడిచిపెట్టుకుపోవడంతో మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీరియస్‌గా ఉండటంతో అక్కడినుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య వర్షిణి, శ్రేహన్, శ్రీనిధ, శ్రీహర్ష అనే ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు. 

పురుగుల మందు తాగి మహిళా రైతు..
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం ఎస్సీగూడకు చెందిన కాంబ్లే జైమాల (45)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల వివాహమెంది. తమకున్న మూడెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని భర్త కాంబ్లే గౌతమ్‌తో పాటు అమె వ్యవసాయం చేస్తోంది. భూమికి పట్టా లేకపోవడంతో రైతుబంధు డబ్బులు రావట్లేదు. రూ.1.50 లక్షల వరకు అప్పుతెచ్చి పత్తి సాగు చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురై పంట పూర్తిగా దెబ్బతింది. సాగుకు చేసిన అప్పుతో పాటు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన మరో రూ.3 లక్షల అప్పు ఉంది. అది ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందిన ఆమె ఆదివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై జహీరొద్దీన్‌ తెలిపారు. కాగా, జైమాలకు ఇటీవల దళితబంధు కింద రూ.10 లక్షల విలువ చేసే యూనిట్‌ మంజూరైంది. నిధులు సైతం ఖాతాలో జమ అయ్యాయి. ఇంతలో ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top