మరణంలోనూ వీడని స్నేహం.. | Two Deceased In Road Accident Kurnool | Sakshi
Sakshi News home page

Road Accident: భోజనం చేసేందుకు బైక్‌పై వెళ్తుండగా..

Sep 28 2021 7:53 AM | Updated on Sep 28 2021 10:41 AM

Two Deceased In Road Accident Kurnool - Sakshi

Road Accident: మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇద్దరూ బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా.. అదే సమయంలో జెడ్పీ గెస్ట్‌ హౌస్‌ వద్ద సిమెంట్‌ దుకాణంలో అన్‌లోడ్‌ చేసేందుకు రివర్స్‌లో వస్తున్న లారీని గమనించక  పోవడంతో ఢీకొన్నారు.

సాక్షి,డోన్‌ టౌన్‌( కర్నూలు): వారిద్దరూ స్నేహితులు.  గౌండా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. రోజూ కలసి పనికి వెళ్లి వస్తున్న వీరిని సోమవారం మృత్యువు బలి తీసుకుంది. డోన్‌ పట్టణంలోని జెడ్పీ గెస్ట్‌ హౌస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన బోయ చిన్న నాయుడికి ముగ్గురు కుమారులు కాగా రాజశేఖర్‌ (18) పెద్దోడు. పదో తరగతి వరకు చదివి గౌండా పని చేస్తున్నాడు.

అలాగే ఇదే గ్రామానికి చెందిన శంకరమ్మ, శేఖర్‌ దంపతులకు కుమార్తెతో పాటు కుమారుడు శివకుమార్‌ (20) ఉన్నాడు. ఆరేళ్ల క్రితం శేఖర్‌ అనారోగ్యంతో మృతి చెందగా శివకుమార్‌ కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడేళ్లుగా రాజశేఖర్, శివకుమార్‌ గౌండా పనికెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. సోమవారం రాజశేఖర్‌ తన బంధువుకు చెందిన స్పోర్ట్స్‌ బైక్‌ తీసుకుని పనికొచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇద్దరూ బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా.. అదే సమయంలో జెడ్పీ గెస్ట్‌ హౌస్‌ వద్ద సిమెంట్‌ దుకాణంలో అన్‌లోడ్‌ చేసేందుకు రివర్స్‌లో వస్తున్న లారీని గమనించక  పోవడంతో ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం డోన్‌ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాజశేఖర్‌ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం శివకుమార్‌ను కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు యువకుల మృతితో వెంకటనాయునిపల్లెలో విషాదం అలుముకుంది. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నగేష్‌ తెలిపారు.

చదవండి: పెళ్లయ్యి ఏడాది కాకముందే.. అబార్షన్‌ చేయించుకుందని!

Advertisement
 
Advertisement
Advertisement