ముంబైలో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు..

Tollywood Actress Arrested In Mumbai Drugs Case - Sakshi

అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ

సాక్షి, హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ ‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో పలువురు టాలీవుడ్‌ హీరోయిన్ల పేరు వినిపించిన సంగతి మరవకముందే మరో టాలీవుడ్‌ నటిని ముంబై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసిందన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ తెలుగు నటిని ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో శనివారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్నామని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. తొలుత ముంబై ఎన్‌సీబీ అధికారులు బాంద్రా రైల్వే స్టేషన్‌ (ఈస్ట్‌)లో శనివారం మహమ్మద్‌ చాంద్‌ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో బాంద్రా ఏరియా నుంచి 400 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా మహమ్మద్‌ సయీద్‌ అనే వ్యక్తి వద్ద పెడ్లర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.

దీంతో సయీద్‌ కోసం మీరా రోడ్‌లోని హోటల్‌లో ఎన్‌సీబీ అధికారులు దాడులు జరిపారు. ఎన్‌సీబీ అధికారులను చూసిన సయీద్‌ పారిపోయాడు. కానీ, అతనితో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ నటి చిక్కింది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసిన ఎన్‌సీబీ అధికారులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ముంబైలో ఎందుకుంది? డ్రగ్స్‌ సప్లయర్‌ అయిన సయీద్‌తో ఆమెకు ఏం పని? హైదరాబాద్‌ నుంచి వచ్చే డ్రగ్స్‌తో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే మాట్లాడుతూ.. ఈ విషయంలో కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని, కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. 

సినిమా తార కాదు..! 
ముంబైలో తెలుగు నటిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారన్న వార్త వినగానే టాలీవుడ్‌ మరోసారి ఉలిక్కిపడింది. ఇంతకు ఎవరా నటి? అన్న అంశం టాలీవుడ్‌ వర్గాల్లో ఆదివారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్‌సీబీ అధికారులు మాత్రం అరెస్టయిన నటి సినిమా తార కాదని, సీరియల్‌ నటి అని.. అంతగా పాపులర్‌ కూడా కాదని చెబుతున్నారు. ఇప్పటికే గతేడాది జూన్‌లో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య అనంతరం మాదక ద్రవ్యాల కేసులో అతని ప్రియురాలితో సహా ముగ్గురు టాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం అప్పట్లో సంచలనానికి దారి తీసింది.

కాగా గతేడాది ఆగస్టు 15న హైదరాబాద్‌ నుంచి రహస్యంగా తరలిస్తున్న రూ.వందల కోట్ల మెఫిడ్రిన్‌ను ముంబైలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరునాడు ముంబై డీఆర్‌ఐ అధికారులు నగర శివారుల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీని గుర్తించి మొత్తం ముడి సరుకును సీజ్‌ చేయడం అప్పట్లో సంచలనమే రేపింది. ఈ రెండు ఉదంతాలు మరవకముందే మూడోసారి హైదరాబాద్‌కు చెందిన నటి డ్రగ్స్‌ కేసులో అరెస్టవ్వడం గమనార్హం. మొత్తానికి డ్రగ్స్‌ విషయంలో హైదరాబాద్‌–ముంబైకి ఉన్న సంబంధాలు బయటపడటం దాదాపు ఆరునెలల్లో ఇది మూడోసారి..  

(చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top