అరగంటలో ఫంక్షన్‌ హాల్‌కు.. క్షణంలో ఘోరం..

Three Persons Deceased Road Accident Karimnagar - Sakshi

శుభకార్యానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి..

లారీ ఆటోపై పడటంతో ప్రమాదం

ముబారక్‌నగర్‌లో విషాదం

సాక్షి,గోదావరిఖని/కోల్‌సిటీ: అరగంటలో తాము వెళ్తున్న ఫంక్షన్‌ హాల్‌కు చేరుకునేవారు. అంతలోనే మృత్యురూపంలో బూడిద లారీ అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొగ్గు లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న ఆటోపై పడింది. ఈ సంఘటనలో ఆటోలో వెనకవైపు కూర్చున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారి మృత్యువు నుంచి కొద్దిలో బయటపడింది. సంతోషంగా వెళ్తున్న వారి కుటుంబంలో ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.

రామగుండం మండలం ముబారక్‌నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్‌ కుటుంబం మంచిర్యాల జిల్లా ఇందారంలో జరుగుతున్న ఓ శుభకార్యం నిమిత్తం అదే ప్రాంతం ఖాదర్‌కాలనీకి చెందిన రహీంబేగ్‌ ఆటోను కిరాయి మాట్లాడుకున్నారు. ఆటోలో షేక్‌ హుస్సేన్‌తోపాటు ఆయన పెద్ద కుమారుడు షేక్‌ షకీల్, మరో కుమారుడు తాజ్‌బాబా, పెద్ద కుమారుడి భార్య షేక్‌ రేష్మ, మనుమడు షేక్‌ షాకీర్, మనుమరాళ్లు షేక్‌ సాధియా, షేక్‌ సాదియా ఉమేరా కలిసి రాత్రి సమయంలో బయల్దేరారు. గోదావరిఖని గంగానగర్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ వద్దకు చేరగానే.. బొగ్గు లోడ్‌తో ఓ లారీ రోడ్డు దాటుతోంది. ఆ లారీని గమనించిన ఆటోడ్రైవర్‌ రహీంబేగ్‌ ఆటోను పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో ఫ్‌లైఓవర్‌ పైనుంచి అతివేగంగా వచ్చిన బూడిద లారీ బొగ్గులారీని ఢీకొట్టింది.

వేగంగా ఉండడంతో రెండు లారీలూ పడిపోయాయి. బూడిద లారీ ఆగి ఉన్న ఆటోపై పడడంతో అందులో కూర్చున్న షకీల్‌(28), ఆయన భార్య రేష్మ, కూతురు షాదీ ఉమేరా(రెండు నెలలు) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అప్పటికే షకీల్, రేష్మ, సాదీ ఉమేరా మృతి చెందారు. ఆటోడ్రైవర్, మృతుడి తండ్రి, సోదరుడు, పెద్దకుమారుడు, పెద్దకూతురు స్వల్వ గాయాలతో బయటపడ్డారు. బూడిద లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతదేహాలను గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన షేక్‌ షకిల్‌ వెల్డర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. 

వెనకాల ఉన్నవారిపై పడిన లారీ..
ఆటోలో వెనకభాగంలో కూర్చుని ఉన్నవారిపై బూడిద లారీ పడటంతో వారిలో ముగ్గురు మృతి చెందారు. తండ్రి చేతిలో ఉన్న షేక్‌షాదియా మాత్రం ప్రాణాలతో బయటపడింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న వారు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెండు లారీలు రోడ్డుపై పడిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. హైవే కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన తీరును తెలుసుకుని వారి కుటుంబాన్ని ఓదార్చారు.  

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top