
యశవంతపుర: పోలీసులమంటూ ఇంటిలోకి దూరిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి రూ. 19 లక్షల నగదు, అరకేజీ బంగారంతో పాటు వారిని అపహరించి కారులో బెంగళూరు చుట్టూ తిప్పి ప్రాణం తీస్తామంటూ హెచ్చరించి వదిలిపెట్టిన ఘటన శుక్రవారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ఇంజినీర్ సామ్యానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలు... సామ్యా నాయక్ ఒక నిర్మాణ సంస్థలో పని చేస్తూ భార్య బిడ్డలతో మహాలక్ష్మీ పురంలో నివాసం ఉంటున్నారు. 31న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నలుగురు వ్యక్తులు తిపటూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ ఇంటిలోకి ప్రవేశించారు. మీ అల్లుడు జయనాయక్ ఇచ్చిన గన్, బంగారు నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నగదు, నగలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు నమ్మించి వారిని బలవంతంగా కారులో కూర్చొబెట్టుకుని నగరమంతా తిప్పారు. సాయంత్రం సామ్యానాయక్ అన్న కొడుకు రోహన్ పిలిపించుకుని అప్పటికే కిడ్నాపైన మనోహర్, రోహన్‌లపై దాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామంటూ హెచ్చరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.