TDP MLC Ashok Babu Arrest: అడ్డంగా దొరికిన అశోక్‌బాబు

TDP MLC Ashok Babu Arrested By AP CID - Sakshi

బి ‘కామ్‌’గా ఫేక్‌ సర్టిఫికెట్‌

ఉస్మానియా వర్సిటీ పేరుతో బురిడీ

సర్వీస్‌ రిజిస్టర్‌లో డి.కామ్‌ అర్హతను బి.కామ్‌గా ట్యాంపర్‌

ఫిర్యాదులు రావడంతో ఆ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్‌పై కొట్టివేతలు

టైపింగ్‌ పొరపాటని పేర్కొంటూ తప్పించుకునే యత్నం 

కీలక ఆధారాలతో అరెస్టు చేసిన సీఐడీ.. బెయిల్‌ మంజూరు చేసిన విజయవాడ కోర్టు

సాక్షి, అమరావతి: తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పదోన్నతి కోసం తన సర్వీస్‌ రిజిస్టర్‌ను ట్యాంపర్‌ చేయడమే కాకుండా, ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్‌ బి.కాం సర్టిఫికెట్‌ సమర్పించి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. దీనిపై కేసు పెండింగులో ఉన్నాసరే నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. తనపై కేసులు పెండింగులో లేవని పేర్కొంటూ ఎమ్మెల్సీగా తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందడమే కాకుండా సహచర ఉద్యోగుల పదోన్నతి అవకాశాలకూ గండి కొట్టారు. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసిన సీఐడీ విభాగం.. కీలక ఆధారాలు సేకరించి, ఈ కేసులో కీలక పురోగతి సాధించింది. 

అర్థం కాని విధంగా సర్వీస్‌ రిజిస్టర్‌లో మార్పులు  
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరిన అశోక్‌బాబు.. డి.కాం(డిప్లమో ఇన్‌ కంప్యూటర్స్‌) చేసి, సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కాగా వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్నతోద్యోగం పొందాలంటే డిగ్రీ కనీస అర్హత ఉండాలి. దాంతో తన సర్వీస్‌ రిజిస్టర్‌లోని ‘డి.కాం’ ను కాస్త ‘బి.కాం’గా మార్చివేసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. తర్వాత పదోన్నతి పొంది వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరారు. కాగా, ఆయన విద్యార్హతపై ఫిర్యాదులు రావడంతో సర్వీస్‌ రిజిస్టర్‌లో విద్యార్హత కాలమ్‌లో పేర్కొన్న సమాచారాన్ని అడ్డదిడ్డంగా కొట్టివేశారు. అందులో పేర్కొంది ఏమిటన్నది తెలియకుండా చేశారు.  
 
పొరపాటు అయితే ఫేక్‌ సర్టిఫికెట్‌ ఎందుకు? 
పదోన్నతి కోసం తన విద్యార్హత బి.కాంగా పేర్కొన్న అశోక్‌బాబు అంతటితో ఆగలేదు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఓ ఫేక్‌ బి.కాం సర్టిఫికెట్‌ను సృష్టించి సమర్పించినట్టు తెలుస్తోంది. తాను బి.కాం చేసినట్టుగా అఫిడవిట్‌ కూడా సమర్పించారు. సీఐడీ దర్యాప్తులో ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దాంతో ఈ కేసులో సీఐడీ అధికారులు కీలక ఆధారం సేకరించినట్టే. తనపై సీఐడీ కేసు నమోదు చేయగానే తాను ఇంటర్మీడియట్‌ మాత్రమే చదివానని, తన సర్వీస్‌ రిజిస్టర్‌లో టైపింగ్‌ పొరపాటుతో బి.కాం అని పడినట్టు అశోక్‌బాబు వాదిస్తూ వచ్చారు. మరి టైపింగ్‌ పొరపాటే అయి ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్‌ సర్టిఫికెట్‌ ఎందుకు సమర్పించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే అశోక్‌బాబు ఉద్దేశ పూర్వకంగానే ఫేక్‌ సర్టిఫికెట్‌తో ప్రభుత్వాన్ని మోసం చేశారన్నది స్పష్టమవుతోంది.  
 
ఎమ్మెల్సీ నామినేషన్‌లోనూ తప్పుడు సమాచారం 
టీడీపీ ప్రభుత్వ హయాంలో అశోక్‌బాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. పైగా ఆయన్ను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ చేశారు. అందుకోసం హడావుడిగా ఆయనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇచ్చారు. పెండింగు కేసులు ఉండగా, స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వకూడదన్న నిబంధనను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఇక ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ తప్పుడు సమాచారమే ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులు పెండింగులో లేవని పేర్కొన్నారు. అయితే లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది.

సర్వీస్‌ రిజిస్టర్‌లో ట్యాంపరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ సర్టిఫికెట్, నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ, ఎమ్మెల్సీగా నామినేషన్‌ కోసం సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం.. ఇలా వీటన్నింటికీ సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అశోక్‌బాబు సమర్పించిన ఫేక్‌ సర్టిఫికెట్‌కు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సర్వీస్‌ రిజిస్టర్‌లో ట్యాంపరింగ్‌ చేసినట్టు కూడా ఆధారాలు లభించాయి. అనంతరమే అశోక్‌బాబును అరెస్టు చేసి గుంటూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసుపై ఆయన్ను సీఐడీ అధికారులు శుక్రవారం వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది.   
  
తప్పుడు నివేదిక ఇచ్చిన వారినీ కేసులో చేర్చాలి 
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయడం హర్షనీయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవోల సంఘం–1 అధ్యక్షుడు బి.మెహర్‌ కుమార్‌ అన్నారు. ఆయన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో రుజువు చేసి తగిన శిక్ష పడేలా చూడాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్‌బాబును సమర్థించిన ముగ్గురు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసేందుకు వీలుగా హడావిడిగా తప్పుడు నివేదిక ఇచ్చిన వారిని కూడా కేసులో చేర్చాలన్నారు. అశోక్‌బాబుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేసిన అప్పటి విచారణ అధికారి పుల్లయ్య, సంయుక్త కమిషనర్‌ కిరణ్‌కుమార్‌లపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.    
  
సిండికేట్‌ రింగ్‌ మాస్టర్‌ అశోక్‌ బాబు 
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు రాష్ట్రంలో పలువురు అవినీతి ఉన్నతాధికారుల అక్రమాలకు వత్తాసు పలికే సిండికేట్‌ను నిర్వహించారని విజయవాడలోని సనత్‌ నగర్‌కు చెందిన షేక్‌ నజియా బేగం విమర్శించారు. ప్రధానంగా ఏసీబీ దాడుల్లో దొరికిన ఉన్నతాధికారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఆ కేసులను నీరుగార్చారని చెప్పారు. 2016లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అశోక్‌బాబే రక్షించారన్నారు.

ఏసీబీ కేసు విచారణ కూడా ముందుకు సాగకుండా చేయడంతోపాటు కనీసం శాఖా పరమైన విచారణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. దీనిపై తాము పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అశోక్‌బాబు, సంయుక్త కమిషనర్‌ అవినీతికి వత్తాసు సహకరించిన ఓ ఐఏఎస్‌ అధికారికి విజయవాడలో కోట్లాది రూపాయల విలువైన ఇంటిని బహూకరించారని ఆమె చెప్పారు. అశోక్‌బాబు సిండికేట్‌లోని అవినీతి అధికారులపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.  

గుంటూరులో టీడీపీ హైడ్రామా  
పాత గుంటూరు/విజయవాడ లీగల్‌ : సీఐడీ అధికారులు అరెస్టు చేసిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులను లోపలికి అనుమతించక పోవడంతో ధర్నాకు దిగి హైడ్రామాకు తెరలేపారు. సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్‌ బాబుపై అక్రమ కేసులు పెట్టారని శుక్రవారం హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. అశోక్‌ బాబును అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టినట్లు అశోక్‌ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు.

తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్‌ తీసుకోలేదని చెప్పారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని దాడులు చేసినా భయపడమని అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కనుసన్నల్లో సీఐడీ అధికారులు పని చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలు రావిపాటి సాయికృష్ణ, మన్నవ మోహనకృష్ణ, అబ్బూరు మల్లి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. కాగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేసిన 60 మందిపై సెక్షన్‌ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తరలించారు.

బెయిల్‌ మంజూరు  
ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతి పొందినట్లుగా నిర్ధారణ కావడంతో సీఐడీ పోలీసులు 10వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ మూడవ అదనపు చీప్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఇన్‌చార్జ్‌ జడ్జి ఎదుట హాజరు పరిచారు. రాత్రి వరకు ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు చేశారు.

ఇదిలా ఉండగా అంతకు ముందు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లంచ్‌ మోషన్‌ రూపంలో అశోక్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ దొనడి రమేశ్‌ ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో లోకాయుక్త వాదన కూడా వినేందుకు ప్రతివాదిగా చేర్చాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top