మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు

Son In Law Burglarized Uncle House - Sakshi

స్నేహితులతో కలిసి మామ ఇంట్లో చోరీకి స్కెచ్‌ 

ఎవరూ గుర్తుపట్టకుండా బురఖాతో రెక్కీ 

అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశం 

ముగ్గురు నిందితుల అరెస్టు 

రూ.33.02 లక్షల విలువైన సొత్తు స్వాధీనం 

సాక్షి, సిటీబ్యూరో: పుట్టినరోజు వేడుకల కోసమని వచ్చిన మామ ఇంట్లో చోరీకి స్కెచ్‌ వేశాడో వ్యక్తి. స్నేహితులను ఉసిగొల్పి.. వారితో దోపిడీ చేయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు..  ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ క్రైమ్స్‌ యాదగిరితో కలిసి ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ శనివారం వివరాలు వెల్లడించారు.

సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్‌ ఉల్లిఖాన్‌ గత నెల 31న పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతడి మామ హాజరయ్యాడు. అతను ధరించిన ఖరీదైన గడియారాలు, ఆభరణాలను చూసిన యాసిర్‌కు దుర్బుద్ధి పుట్టింది. మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్‌ వేశాడు. ఇదే విషయాన్ని అతని స్నేహితులైన మహ్మద్‌ అయ్యాజ్‌ ఖాన్, హమ్దాన్‌ అశ్వాక్‌లకు సూచించాడు. ముగ్గురు కలిసి పథకం పన్నారు.

గత నెల 31న అశ్వాక్‌ బురఖా ధరించి అయాజ్‌ ఖాన్‌ బైక్‌పై మీర్‌పేటలోని షరీఫ్‌నగర్‌లోని ఉల్లిఖాన్‌ మామ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఇంటి బయట అయాజ్‌ కాపు కాస్తుండగా.. అశ్వాక్‌ ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచి, అందులోని సొత్తును చోరీ చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశ్వాక్, అయాజ్, ఉల్లిఖాన్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.33.02 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం ఆభరణాలు, 9 ఖరీదైన చేతి గడియారాలు, 405 అమెరికన్‌ డాలర్లు, బైక్, సెల్‌ఫోన్, డిజిటల్‌ కెమెరాలను స్వా«దీనం చేసుకున్నారు.
చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్‌ అరెస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top