అదనపు కట్నం వేధింపులు.. పిల్లలు పుట్టాక కూడా అందంగా లేదంటూ సౌందర్యపై..

Secunderabad Bansilalpet Mother Twin Kids Suicide Case Details - Sakshi

క్రైమ్‌: బన్సీలాల్‌పేట్‌ కవల పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పపడ్డ తల్లి ఉదంతంలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించారు గాంధీనగర్‌ పోలీసులు. పెళ్లయినప్పటి నుంచి అందంగా లేవంటూ అవమానించడంతో పాటు అదనపు కట్నం తేవాలని వేధించడంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిపారు. 

సిద్ధిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న, దుర్గమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చారు. ప్రస్తుతం బన్సీలాల్‌పేట డివిజన్‌ జీవైఆర్‌ కాంపౌండ్‌ డబుల్‌బెడ్‌రూమ్‌ కాలనీలో ఉంటున్నారు. వారికి నలుగురు కుమార్తెలు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న వేమన్న పిల్లల పెళ్లిళ్లను ఉన్నంతలో ఘనంగా చేశారు. మూడేళ్లక్రితం చిన్నకూతురు సౌందర్య(26)ను సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. రూ.2.5 లక్షల నగదు, 4 తులాల బంగారం ఇచ్చారు. గణేష్‌, సౌందర్యలు ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో నివాముంటున్నారు.

పద్మారావునగర్‌లోని ఓ క్షౌరశాలలో పనిచేస్తున్న గణేశ్‌... పెళ్లయిన కొంతకాలం తర్వాత అదనపు కట్నం తీసుకురమ్మంటూ భార్యను వేధించసాగాడు. ఏడాదిన్నర క్రితం సౌందర్య కవలలకు(పాప, బాబు) జన్మనిచ్చినా భర్త వేధింపులు ఆగలేదు. పలుమార్లు పుట్టింటి నుంచి అడిగినంత సొమ్ము తీసుకొచ్చినా అతను మారలేదు. పైగా అందంగా లేవంటూ హింసించేవాడు. ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వమిచ్చిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లును తన పేరిట రాయించాలంటూ ఒత్తిడి చేసేవాడు. యాదాద్రి సమీపంలోని స్థలాన్ని సౌందర్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినా సంతృప్తి పడలేదు.

దీంతో సౌందర్య 25 రోజుల క్రితం పిల్లలతోసహా పుట్టింటికి చేరింది. ఇక్కడకు వచ్చాకా ఆమెను ఫోన్‌ ద్వారా భర్త వేధించేవాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాంధీనగర్‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పనిచేస్తున్న పద్మారావునగర్‌లోని దుకాణానికి వెళ్లిన సౌందర్య.. తనను తీసుకెళ్లాలంటూ భర్తను కోరినా వినలేదు. దాంతో బన్సీలాల్‌పేటకు తిరిగొచ్చి, ఇంట్లో తల్లి నిద్రపోతున్న సమయంలో ఇద్దరు పిల్లలతో 8వ అంతస్తు పైకి వెళ్లింది. మొదట పిల్లలను కిందకు తోసేసి, ఆమె కూడా దూకేసింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాంధీనగర్‌ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వచ్చి బాధితులను పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రిటైర్డ్‌ ఎంపీడీఓ హత్యలో ఎమ్మెల్యే హస్తం?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top